కవిత్వానికి తర్కం అవసరం లేదా?

కొద్ది రోజుల క్రిందట నాగరాజు గారు తర్కం మీద రాసిన బ్లాగు చదివాను. చదివాక చాలా చాలా సందేహాలు మొలకెత్తాయి. కొన్నింటికి సమాధానాలు అక్కడా ఇక్కడా చదివి కొంతమేరకు సమాధానపడ్డాను. కానీ, ఒకటి మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అదేమిటయ్యా అంటే, కవిత్వానికి తర్కం అవసరం లేదా? నిజంగానే అస్సలు అవసరంలేదా? అదే బ్లాగులో కొద్దిగా రానారె గారికీ నా సందేహమే వచ్చిందా అనిపించింది.

అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ఈమాట లో చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివి ఎవరో కవితకి తర్కం బద్దశతృవు అనటం చూసి. ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని అంతరాత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!

మొదటగా గణితమే తీసుకుందాం. 1+1 ఎంత అనగానే 2 అంటున్నాము. ఎవడైనా 3 అంటే తర్కించి వాడిని ఒప్పిస్తున్నాము. కానీ అసలు 1 కి 1 కలిపితే 2 అని మనం ముందుగానే అంగీకరించాం (అందరూ అలానే నేర్చుకుంటున్నారు కాబట్టి). నే చెప్పదలచుకున్నదేమంటే, మన చుట్టూ ఉన్న నలుగురు నమ్మినదాన్ని ముందుగా మనం నమ్ముతున్నాం. ఆపై దాని ఆధారంగా, ఆ విషయానికి సంబంధించిన దానిపై మంచా చెడా అని తర్కిస్తున్నాము. అసలు గణితం అంటే తెలియని వాడికి 1,2,3 అంటే ఏవో రాతలో లేక చిత్రాలో అనుకుంటాడు అంతే కదా.

ఇప్పుడు కవిత్వానికొద్దాం.

ఈమాటలోని కవితే తీసుకుందాం.

“ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ”

ఈ వాక్యాలే చదివితే, పరిస్థితి నే పైన చెప్పిన (గణితం రానివాడి పరిస్థితే) 1,2,3 లానే ఏమీ అర్థం కాదు. కానీ కవిగారు అంతటితో ఆగిపోలేదు. వెంటనే,

“అడవిలో మరొక సారి
తప్పిపోవాలనుంది” అన్నాడు.

ఆ “అడవి” అన్న పదంతో మొత్తం అర్థం అవగతమైపోయింది. మరి కొన్ని సందర్భాలలో కవి ఉపమానాలూ, ఉపమేయాలూ, వర్ణనలు ద్వారా విషయం చెబుతాడు.

ఇదో చిన్న ఉదాహరణ. సాధారణంగా కవి ఏ మాత్రం తర్కానికి నిలబడని విషయాలు రాసే సాహసం చెయ్యడు, తన తార్కిక ఆలోచనా పరిధికి మించిన సాహసం చెయ్యకుండా ఉంటేతప్ప. లాజిక్ అన్నది కవితని తవిక కాకుండా కాపాడుతుందని నా భావన.  అబ్బే,  మేమనేది కవిత యొక్క అర్థంలో లాజిక్కు కాదు, కవిత యొక్క పదాల కూర్పులో లాజిక్కు,  పదాల కూర్పులో లాజిక్కుతో అస్సలు పనిలేదు, భావంలో పసవుంటే చాలు అంటారేమో.

మరిప్పుడు నే పైన చెప్పిన 1,2,3 మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అంకెలు తెలియనివాడికి 1+1 అర్థం తెలియనట్లే, కవి వాడే పదాలు ఇల్లాజికల్ అని విషయ పరిజ్ఞానం లేని వాడికి అనిపించొచ్చు. ఆ జ్ఞానం ఉన్నవాడికి అదేమీ ఇల్లాజికల్ గా ఉండదు. తర్కం అన్నది ఇక్కడ “రెలెటివ్”.  అంటే నాకర్థమయినట్లు మరొకడికి కవి హృదయం అర్థం అవాలని లేదు కదా.   ఆమాత్రానికే, కవి ఏవో లొల్లాయ్ పదాలు వాడాడంటారా?  ఈ సాకుతో టోకుగా కవిత్వానికి అసలు తర్కంతో సంబంధం లేదు అనటం నాకు వినటానికి చాలా కష్టంగా ఉంది.

పనిలో పనిగా నిన్న ఈనాడులో ఉన్న శ్రీశ్రీ గారి కవితలు చాలా వరకు చదివేశా. ఆయన ఏమీ ఇల్లాజికల్ గా రాసినట్టు నాకు అగుపించలా.  సినారె గారి ఈ కవిత చూడండి.

“ఈ గద్దె కోసమేనా ఇన్ని వేషాలు వేసేది
ఈ గడ్డి కోసమేనా ఇన్ని మోసాలు చేసేది
….”

ఇందులో గడ్డిని గడ్డి గానే భావిస్తామా? బుర్రకి వెంటనే పదునుపెట్టి డబ్బు అని అనువదించుకోమూ? గడ్డి అన్న పదానికి గడ్డి మాత్రమే అర్థం తెలిసినవాడికి ఇవి తర్కానికి నిలబడని వాక్యాలు. మిగిలిన వారికి కాదు కదా.

నాకినిపిస్తుంది, కవిత్వం అనే గమ్యం కోసం రెండు వైపులా తాళ్ళుకట్టి ఒక దారి(క్యూ) తయారు చేశామనుకుంటే, లాజిక్(తర్కం) అన్నది కవిని ఆ తాళ్ళు దాటి పోకుండా కవిని హెచ్చరిస్తూ గమ్యానికి చేరుస్తుంది. తర్కంతో నిమిత్తం లేదనుకునే కవి ఆ రెండు తాళ్ళ మధ్య కుదురుగా ప్రయాణించలేక, వాటిని బయటకు తోసుకుంటూ వంకర టింకరగా గమ్యంవైపు పయనిస్తాడు. 

ఇల్లాజికల్ కవిత్వమేదో ఇక్కడ నేను చూపిస్తున్నాను.

ఇదో సినిమా పాటలోది

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే …

బంగాళాఖాతంలో నీటిని ఒక ప్రేయసితో పోలుస్తున్నాడు కవి. అంటే ప్రేయసి సముద్రంలో నీళ్ళలా ఉప్పగా ఉంటుందనా లేక ఆమె హృదయం ఆ సముద్రం అంత లోతనా? హాయిగా ఎగురుతూ ఇలాంటి అర్థంతో ఎందుకు పాడాడబ్బా? ఇది నాకు ఇల్లాజికల్ గానే కనపడింది. కానీ ఈనాడులో ఈ వ్యాసం చదివాక, ఓహో అదా కవి హృదయం అనుకున్నాను. కాబట్టి, తర్కం అన్నది ఇక్కడ “రెలెటివ్”. నిజానికి నాకిప్పటికీ ఈ పాట ఇల్లాజికల్ గానే ఉంది. ఎందుకంటే, కడలిని పుంలింగంలో వ్యవహరిస్తారు. మరి కడలి అలలు స్త్రీ వయస్సుతో ఎలా పోలుస్తాడు?

ఇంకో పాట ఉంది,

స్ట్రాబెరి కనులా….. అని మెరుపు కలలు సినిమాలో

ఇది డబ్బింగ్ పాటా కాదా అన్నది పక్కన పెడితే, మాతృక తమిళంలో ఉన్న అర్థాన్ని అలానే తెలుగులో అనువదించాడు కవి. స్ట్రాబెరీ పండుకీ, కళ్ళకి ఏమిటి సంబంధం? రంగులోనా, రుచిలోనా, ఆకృతిలోనా? దీని రహస్యం ఇంకా తెలియలేదు నాకు.

జంధ్యాల గారి సినిమాలో కవితలు

నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా,
నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా…

హాస్యాత్మకంగా బానే ఉందీ కవిత. మరి మనం దీన్ని ఎందుకు హర్షించం? బాగోలేదనటానిక్కూడా మనం లాజికల్ గా ఆలోచించి, ఈ కవి ఏంటి మనల్ని భయపెట్టి తనను కవిగా చెప్పుకుంటున్నాడని,  దానిని మంచి కవిత్వంగా స్వీకరించలేకపోతున్నాము. ఏదో నోటి మీద ఆనుతున్నాయని సినిమాల్లో కవితలు చెప్పాను. కానీ ఆధునిక కవిత్వంలో ఇవి కోకొల్లలు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, టోకుగా కవిత్వానికి తర్కానికీ అస్సలు సంబంధం లేదని చెప్పకండి. అలా అని, నేనేదో గొప్ప కవిని కాదు. ఏదో కొద్దిగా సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాడిని, అంతే.  నా అభిప్రాయం తప్పని వివరిస్తే సరిదిద్దుకోటానికి వెనకాడను.

నా భయమల్లా కవిత్వానికి తర్కానికి లంకె లేదని రెచ్చిపోయి జనాలు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా కవిత్వం రాసుకుంటూ పోతే, ఇక చదవగలమా? జంధ్యాల గారు హాస్యానికి చెప్పిన తవికలే ఇక మనకి కవితలుగా మిగులుతాయేమో అని నా భయం. అంతే.

7 స్పందనలు to “కవిత్వానికి తర్కం అవసరం లేదా?”

  1. వికటకవి అన్నారు:

    నాగరాజు పప్పు గారి వ్యాఖ్య:

    http://canopusconsulting.com/salabanjhikalu/?p=50

  2. కొత్తపాళీ అన్నారు:

    మీరు పొరబడ్డారు .. రసపట్టులో తర్కంకూడదని పెద్దలు చెప్పింది .. కవిత్వానికి తర్కం అక్కర్లేదని కాదు. కవిత్వం కంట బడగానే .. అంటే ఒకసారి చదివెయ్యగానే రససిద్ధి కలిగిపోదు. పాఠకుల మనసులోనూ దాన్ని గురించి కొంత మథనం జరగాలి. ఆ మథనానికి కట్టుతాడు తర్కమో ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. ఆ మధనం జరిగి రసం పుడితే అప్పుడింక తర్కం అనవసరం. మధనం జరిగినా రసం పుట్టక పోతే .. మన ఖర్మం. మరో మాట - కవి వాడే కవి సమయాలు, అలంకారాలు బుద్ధికి అతీతం కాదు.

  3. వికటకవి అన్నారు:

    కొత్తపాళీ గారు,

    అర్థమయీ అవనట్లుగా ఉంది. “కవిత్వానికి తర్కం అక్కరలేదనికాదు” అని చెప్పి కాస్త మనసుకి స్వాంతన చేకూర్చారు. కాకపోతే, నాకు మరింత వివరణ (క్లారిటీ) కోసం అసలు “రసపట్టులో తర్కం కూడదు” అని పింగళి గారు సినిమాలో ఏ సందర్భంలో అనిపించారో తెలుసుకోవాలని ఉంది. (సినిమా మాయాబజార్ అనే అనుకుంటా, కరక్టే కదూ). మరోసారి చూడాలి ఈ సినిమా.

  4. bollojubaba అన్నారు:

    కవిత్వంలో తర్కం ఒక్కోక్క సారి చాలా అందంగా వ్యక్తీకరింపబడుతుంది. ఉదాహరణ: వామనుడు దేహాన్ని పెంచుకుంటూ పోయినప్పుడు, కాలివద్ద ఉన్న సూర్యుడు, నెమ్మదిగా మొలతాడు మణిలాగ, తరువాత కంఠాభరణ మెరుపులాగ, ఆపై చెవికుండలాల లాగా, చివరకు శిరో మణి లాగా కనిపిస్తాడు అని పోతన వర్ణిస్తాడు. ఆపద్యం చక్కటి కవిత్వమే అదే సమయంలో అంతే చక్కటి తర్కమే! కాదంటారా?

    మరో ఉదాహరణ : చలం తనమ్యూజింగ్స్ లో ఒక చోట ఒక టేబులు గురించి ఇలా అంటాడు. - ఈ చెక్క టేబులు ఒకప్పుడు ఒక మహా వృక్షం కదా! తన శాఖల పై ఎన్నెన్ని కోయిలలను కూర్చుండబెట్టుకొని ఎన్నెన్ని కచేరీలు చేయించుకొని ఉంటుందో - అని. ఇందులో కవిత్వం ఉంది అంతే స్థాయిలో తర్కం ఉంది. కొంచెం వెనక్కు వెళితె కవి ఆలోచన నిజం కాదా. అఫ్ కోర్స్, చెట్లు కచేరీలు చేయించుకుంతాయా అంటే సమాధానం ఉండదనుకోండి అలాగే ఏ ఎందుకు చేయించుకోకూడదు అంటే కూడా సమాధానం ఉండదు. ఓ ఆత్రేయ పాటలో గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు అన్నట్లుగా.

    తర్కంలేని మంచి కవిత్వానికి అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు.

    కలుస్తూ ఉందాం

    బొల్లోజు బాబా

    దయచేసి నాబ్లాగు విజిట్ చేసి అందులోని కవితలలో ఉన్న/లేని తర్కాన్ని తర్కించండి.
    http://sahitheeyanam.blogspot.com/

  5. కామేశ్వర రావు అన్నారు:

    బాబాగారు,
    మీరు పోతన తర్కాన్ని కాస్త తిరగేసారండీ :-)
    ముందు గొడుగూలా, తరవాత శిరోరత్నంగా, కుండలంలాగా… చివరకి పాదపీఠంలాగా - ఇదీ వరస.

    రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,
    శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై,
    ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచత్ఘంటయై, నూపుర
    ప్రవరంబై, పదపీఠమై, వటుడు దా బ్రహ్మాండమున్నిండుచోన్.

  6. చదువరి అన్నారు:

    కామేశ్వరరావు గారూ, నేనీ పద్యం కోసం వెతుకుతున్నాను. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ పద్యం గురించి చదివాను. అప్పుడు నేను దాన్ని దాచుకోలేదు. ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాను. నెనరులు.

  7. bollojubaba అన్నారు:

    కామేశ్వరరావు గారికి,
    నా పొరపాటును గుర్తించాను. తెలిపినందుకు థాంక్స్.
    ఆపద్యం లో లోతైన తర్కాం ఉందా లేదా అన్న విషయంపై మీరేమీ మాట్లాడలేదు.
    మరోసారి పద్యరూపంలో చదువుకొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    మీ బాబా
    http://sahitheeyanam.blogspot.com/

ప్రత్యుత్తరమిమ్ము