ఘోరదర్శన్ – నేను

Fox టీవీ వెదర్ ఛానెల్లో ఏ పూటకాపూట ఎంతో కచ్చితంగా వాతావరణం చెప్పే రీతిని చూస్తూంటే, అలనాటి ఘోరదర్శన్ జ్ఞాపకాలు మెదిలాయి……. రోజూ ఇలా మొదలెట్టేవారు..

నమస్కారం, ఈనాటి ఘోరదర్శన్ ప్రసారాలకి స్వాగతం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు.

ఉదయం 9:00 గంటలకు లకు ఉదయం ప్రసారాలు…
మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న ప్రసారాలు…..
సాయంత్రం 5:00 గంటలకు సాయంత్రం ప్రసారాలు…..

(అబ్బో ఏం సృష్టి రహస్యం చెప్పావురా బాబూ, ఉదయం పూట ఉదయం ప్రసారాలుట,   మధ్యాహ్నం పూట మధ్యాహ్న ప్రసారాలుట, సాయంత్రం పూట సాయంత్రం ప్రసారాలుట అని తెగనవ్వుకొనే వాళ్ళం.)

తర్వాత సాయంత్రం టైం పాసు చేయటానికి బొత్తిగా ప్రోగ్రాములు లేక, లలిత సంగీతం పేరుతో ముందుగా ఓ బృందగీతం అని చెప్పి ఓ పెద్ద గుంపుతో (మందగీతం) ఓ రెండు పాటలు పాడిస్తారు. అదో పెద్ద గోలగా ఉండేది.

అదవటమే ఆలశ్యం. వెంటనే ఎక్కడలేని ఆనందంతో అనౌన్సరు ప్రత్యక్షం, ఒక వెకిలి నవ్వుతో! మరే కార్యక్రమం అనౌన్స్ చేయటానికి రాని దొంగ నవ్వు అది. (ఆ నవ్వు వెనకాల ఈ ప్రోగ్రాం దెబ్బకి చావండి, అనుకునే ఓ క్రూరమైన కసి) ఎందుకయ్యా అంటే, తమ తురుపుముక్క ప్రోగ్రాం(తొక్కప్రోగ్రాం) అయిన పాడి పంటలు కార్యక్రమం కోసం. కొన్నేళ్ళుగా చూపిస్తూనే ఉన్న అరిగిపోయిన రికార్డులు అయిన, లాభదాయకమైన పందుల పెంపకమనో, కొబ్బరి చెట్టుకు రబ్బరు తెగులో, పశువుల్లో కృత్రిమ గర్భధారణ అనో, మేకల్లో ఆకలి చావులనో … లాంటివి జనం మీద వదిలేసి చావగొట్టేవాళ్ళు. ఈటీవీ వాడొచ్చి “అన్నదాత” పేరుతో అందర్నీ లాక్కెళ్ళిపోయినా అదే వరస.

తరువాత మొదలయ్యేది వాతావరణ ప్రహసనం. నోరెళ్ళ బెట్టుకొని, ఆశగా ఏదో పనికొచ్చే వాతావరణ విషయాలు చెబుతాడేమో అని ఎదురు చూసేవాడికి ఇది దక్కేది.

ఈ రోజు ఆకాశం అక్కడక్కడా మేఘావృతమై ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. (ఇంకా నయం పగలు వెలుగు, రాత్రి చీకటి ఉంటాయి అని చెప్పలా). అక్కడక్కడా ఒకటి రెండు జల్లులు పడొచ్చు. తీరప్రాంతాల వాళ్ళు సముద్రములో చేపలు పట్టుకోవచ్చు!(పెద్ద జోకు, అక్కడికి వీడు చెప్పకపోతే, ఏ జాలరి చేపల వేటకి వెళ్ళనట్లు). గాలిలో తేమ 5%. గాలిలో తేమ శాతంతో నిరక్షరాస్యుడైన రైతు ఏం చేస్తాడో ఆ దేవునికెరుక. ఇంత అఘోరించి, చివరలో ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు అంటాడు. ఒరే బడుద్దాయ్, ఆ చెప్పుకోదగని మార్పేదో చెప్పిచావరా అని గట్టిగా అనాలనిపించినా, జనాలకి భయపడి నోర్మూసుకునే వాణ్ణి. అలా నాలుగు వాక్యాల్లో మొత్తం రాష్ట్రంలోని రైతు సోదరులందరికీ వాతావరణం చెప్పేడ్చేవాళ్ళు.

ఉన్నట్టుండి, రాత్రి  7:00 అయ్యేటప్పటికల్లా ఏ మాత్రం హావభావాల్లేని భ్రాంతిస్వరూప్ ప్రపంచంలో ఏ మూలైనా, ఎక్కడున్నా సరే ఊడలేసుకోని దూకేవాడు వార్తలు చదవటానికి. అదేమిటో గానీ, మహానుభావుడు పెళ్ళి వార్తకీ తద్దినం వార్తకీ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి చదివేవాడు. ఎవరైనా ప్రముఖుడు పోయిన రోజు వార్తలు పోనీ వేరే వాడితో చదివిస్తాడేమో అనుకుంటే, ఊహూ, తానే వచ్చి చావు వార్తలో కూడా కామెడీ నింపేవాడు. ఇలానే చాలా ఏళ్ళ పాటు ఈయన గారు ఘోరదర్శన్ని దున్నుకున్నా, నాకు తెలిసి ఆయన గారి పంటి వరస చూసిన జ్ఞాపకం లేదు.

ఇదంతా ఏదో హాస్యానికనుకున్నా కూడా, తెలిసిందేమంటే ఈ నాటికీ మనోళ్ళ దగ్గర డాప్లర్ రాడార్ లేదుట. అందుకే ఇలా అర్థం పర్థం లేని వాతావరణం చెప్తూ ఉంటారు. అదుంటే, మనకి గంట గంటకీ వాతావరణ విషయాలు కచ్చితంగా తెలుస్తాయి. మన రైతులకి చాలా ఉపయోగం. బహుశా, ప్రయివేట్ ఛానెల్స్ వాళ్ళకి ఉన్నాయేమో. ఘోరదర్శన్ వాళ్ళు ఇది కొనలేకపోవటానికి డబ్బు మాత్రం కచ్చితంగా కారణం కాదనే నా విశ్వాసం.

అలానే ఈ మధ్య నుంచే ఘోరదర్శన్ ఓ ఫ్రీ చానెల్ ఇక్కడ డైరెక్ట్ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నారు. క్వాలిటీ… రామ రామ … అటు బ్లాక్ అండ్ వైట్ కాదూ ఇటు కలర్ కాదు, అదో విచిత్రమయిన రంగులో వస్తున్నాయి కార్యక్రమాలన్నీనూ :-)

6 స్పందనలు to “ఘోరదర్శన్ – నేను”

  1. కొత్తపాళీ అన్నారు:

    ఇండియాలో ఉండగా ఘోరదర్శన్ని చూసింది చాలా తక్కువ .. దానిగురించి చెప్పలేను గానీ ఇక్కడ చూసినంతలో ఏక్యువెదర్ (accuweather) వాడు చెప్పినట్టు ఒక్కసారిగూడా జరగలేదు. అద్సరేకానీ, కొన్ని వాక్యాలు బాగా నవ్వించాయి.

  2. ramya అన్నారు:

    చదువుతూవుంటే నవ్వు ఆగట్లేదు,
    గుడ్ ఫ్రైడే లాంటి పండగలకైతే ఆలలిత గీతాల రొద తారాస్థాయికి చేరుకునేది. ప్రాయోజిత కార్యక్రమం అంటే అర్ధం నాకు అస్సలు తెలియకపోయేది. ఇప్పటికీ శాంతి స్వరూప్ న్యూస్ చదువుతున్నాడా?

  3. వికటకవి అన్నారు:

    కొత్త పాళీ గారూ, ఇండీయాలో ఉంటూ ఘోరదర్శన్ ఎక్కువగా చూడలేదంటే ఆశ్చర్యమే! అప్పట్లో అసలదే కదా దిక్కు.
    రమ్య గారు, అవునవును ఆ పండగ స్పెషల్ పాటలు మరో ఉపద్రవం! మీ ఇరువురి కామెంట్స్ కు కృతజ్ఞతలు.

  4. laitha అన్నారు:

    వికటకవి గారు,
    చాలా నవ్వించారు. “పాపం” అనిపిస్తుంది శాంతిస్వరూప్ గురించి ఇన్ని రకాలుగా జోకులేసుకుంటుంటే. వెంటనే, దానికి బాలి అయ్యిన మనం కదా “పాపం” అని జాలి రివర్సవుతుంది.

    పాడిపంటల కార్యక్రమం ఉండడంలో తప్పేమీ లేదు కదండీ. కాకపోతే అది నిజమగా వ్యవసాయం చేసుకునే వారికి ఎంత మటుకు ఉపయోగపడుతుందో వారే చెప్ప గలరు. నాకు పుట్ట గొడుగుల పెంపకం గుర్తుకు వస్తోంది. ఎందుకంటే అప్పట్లో మా చుట్టు ప్రక్కల ఇళ్ళలో కొంతమంది ఆ కార్యక్రమాలు చూసి అవి పెంచడానికి ప్రయత్నించే వాళ్ళు.

    ఇంకో standard announcement “ఆదివారం సాయంత్రం 5(?) గంటలకు తెలుగు చలచిత్రం”. ఇది వచ్చే వారం కార్యక్రమాల విశేషాలలో. ఎందుకు వారం ముందుగా చెప్పడమో, సస్పెన్సులో ఉంచ దల్చుకుంటే. ఒక్కో సారి కాస్త సినిమా మిగిలిపోతే రాత్రి పదింటికి వార్తల అనంతరం తరువాయి భాగం చూపించడం. అందులో ఎంత సమాజ సేవ. ఇలా అయినా కొందరు వార్తలు చూసి జ్ఞానం పెంచుకుంటారేమో అని వారి ఆఅశ. అలాగే పిల్లలు టీవీకి అతుక్కు పోకుండా ఉండాలంటే మరి ఎంత కష్టపడి ఏర్చి కూర్చాలనుకుంటున్నారు కార్యక్రమాలు? అబ్బా, ఎన్ని హాస్యరస భరిత జ్ఞాపకాలో టీవీతో పెన వేసుకున్నవి. రెండు రెళ్ళ ఆరు, తర్వాత మీరు ఇలా nostalgyని పెంచుతున్నారు:-)

  5. వికటకవి అన్నారు:

    @లలిత,
    నా బాధ పాడిపంటల ప్రోగ్రాం మీద కన్నా, ఆ అరిగిపోయిన వాటి మీదే ఎక్కువ. నిజానికి నాకూ అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఏడ్చింది. చూపించినవే చూపిస్తూ ఉంటే, రైతు గాని నాకే బుర్ర వాచి ప్రోగ్రాంస్ పేర్లు నోటికొచ్చేస్తే, ఇక అసలు రైతు పరిస్థితేమిటి? కాస్త కాలంతో పాటు మారుతూ ఉంటే, ఆ కార్యక్రమమూ బాగుంటుంది.

    మీరు నమ్మరేమో గానీ, క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు, ఈ కార్యక్రమానికి సిటీలో ఇళ్ళళ్ళో కూరగాయలు పెంచుకునే వాళ్ళ కాల్స్ చాలా వచ్చాయి. కాబట్టి, అందరినీ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.

    ఇక మీరన్నట్లు, ఆ ఆదివారం సినిమా సస్పెన్స్ చచ్చేవాళ్ళం తట్టుకోలేక. అదో రకం శాడిజం.

  6. శక్తి అన్నారు:

    కానీ కొన్ని సీరియల్స్ చాలాబాగా ఉండేవి. వరుడు కావాలి, తూర్పులో పడమర ప్రేమంటే ఇదే ఇదే చాలా బాగుండేవి.

ప్రత్యుత్తరమిమ్ము