పద్యము (Poetry), గద్యము (Prose) గా మనము వ్యవహరించే పదాలు రెండూ సంస్కృత పదాలే. పద్య అంటే కొన్ని పదాల సమూహమని, గద్య అంటే ఉచ్ఛరింపబడునది అని అర్థములున్నాయి. ఇకపోతే, ఈ రెండూ కాకుండా పద్యము, గద్యము కలిసిన వాటిని చంపూ(Champu) అని అంటారు.
పద్యానికి నిర్వచనము తేలికే గానీ, గద్యానికి నిర్వచనము అంత తేలిక కాదు. ఎంచేతంటే, పద్యం పద్యమే గాని (గద్యం కానిది), పద్యం కానిదంతా గద్యం కాదు. కాస్త వివరముగా చెప్పాలంటే, అచ్చగా వచనము గద్యం కాదు.
మనము వాడుకలో మాట్లాడేదంతా వచనమే. కానీ ఈ వచనానికి తోడుగా అలంకారము (అర్థ, శబ్ద అలంకారాల్లో ముఖ్యంగా శబ్దాలంకారం) జోడిస్తే, అప్పుడు అది గద్యమవుతుంది. మీరెప్పుడయినా, రేడియోలో ఆ రోజుల్లో తెల్లవారు ఝామున వచ్చే శ్రీనివాసగద్యం విన్నారా?
శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలా ఖండలస్య
నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య
…..
అంతా ఓ చక్కని ప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది. ఇది సంస్కృతములో. ఇదే తెలుగులో అయితే “శ్రీ ఆంజనేయ దండకం” ఓ ఉదాహరణ.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం …..
అలానే స్వామీ వివేకానందుని షికాగో ఉపన్యాసము,కొంతవరకు మన అన్న గారు నందమూరి తారక రామరావు గారి ఉపన్యాస శైలి గద్యమని భావించవచ్చు.
శబ్దాలంకారము మనకు మరీ కొత్త కాదు.అలంకారాలయిన అనుప్రాస,రూపక, ఉపమ, జమక, భ్రాంతిమాన, ఉత్ప్రేక్ష, బక్రోక్తి మరియు శ్లేషలలో మన వాళ్ళు కొన్ని వాడటం చూస్తూనే ఉన్నాము.
ఇకపోతే, మనము తెలుగులో పద్యంగా భావించే వాటిలో చాలా వరకు అచ్చగా పద్యకావ్యములు కావు. కవిత్రయ భారతంతో సహా. కవిత్రయ భారతము కూడా చంపూనే. ఇందులో, పద్యాల మధ్యలో వచనం కనపడుతూ ఉంటుంది అక్కడక్కడా. అచ్చతెలుగు పద్యాలతో కృతులు చాలా కష్టమే. ఇది సవాలుగా తీసుకొని కవిత్రయములో ఒకడైన తిక్కన పూర్తి అచ్చతెలుగు పద్యాలతో “నిర్వచనోత్తర రామాయణము” రచించాడు. ఇది పూర్తిగా పద్యమే.
ప్రస్తుతము మన తెలుగు బ్లాగర్లలో పద్యం ఓ మంచి మధువు గల పుష్పం తేనెటీగలని ఆకర్షించినట్లు, అందర్నీ ఆకర్షిస్తోంది కదా! అందుకే ఈ టపా.


1:49 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
బావుంది వివరణ. పూర్తిగా పద్యంలో రాయడమంటే, అసలు రాయగలిగే ప్రతిభే ఉన్నా, ఎంతో శ్రమతో కూడిన పని అనుకుంటా. ఐతే మన కవివరేణ్యులు రాసినవి చాలా మటుకు చంపూకమాలలన్నమాట.
7:21 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 4, 2008
[...] భయపడి ఆమడదూరం వెళ్లినవారందరికీ ఇతనో వికటకవి. ఈ కవిగారుమాత్రం ఎదురుగా నిలబడి [...]
2:15 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 5, 2008
నాకు తెలిసినంతలో విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం కూడ పూర్తి పద్యకావ్యమే.