న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ

న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొరబడి అవాంఛిత అధికారాన్ని కూడగట్టుకుంటోందని, మన రాజకీయ పార్టీలు చాలా కాలంగా గగ్గోలు పెట్టటం చూస్తునే ఉన్నాము. మరలాగని శాసన వ్యవస్థ ఏమైనా సామాన్యుడి అక్కరకొస్తోందా అంటే, అదీలేదు. ఇది “అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు” లాగా మారింది.

ఈ ఉపోధ్గాతం ఎందుకంటే, మళ్ళీ మరో జూనియర్ డాక్టర్, అందులోనూ ఆడ డాక్టర్ ని తీవ్రంగా కొట్టి గాయపరచటం. మొన్నటి గొడవ ఇంకా సద్దుమణగలేదు, అప్పుడే మరో ఘటన. తప్పు ఒప్పు పక్కన పెడితే, మనకీ బీహార్, ఉత్తరప్రదేశ్ తాలూకు ఆటవిక సంస్కృతి బాగానే వంట పడుతున్నట్టు అనిపిస్తోంది.తీసుకున్న అప్పు తీర్చమని గట్టిగా పట్టుపట్టినందుకు, మొన్నీ మధ్యే ఏకంగా ఓ బ్యాంకు మేనేజర్ని అంతమొందించారు.

గట్టి చర్యలు తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.

ఇప్పుడు భూగోళానికి మరోవైపు…….

నా గ్రీన్ కార్డుని నేం చెక్  అన్న సాకుతో ఎఫ్.బీ.ఐ దాదాపు మూడేళ్ళుగా పెండింగులో పెట్టి హింసించారు. ఎందరో నా తరువాతి వాళ్ళు గ్రీన్ కార్డు పుచ్చుకోవటం కూడా అయిపోయింది. ఎదురు చూసి చూసి, కాస్త ధైర్యం చేసి ఏకంగా ఎఫ్.బీ.ఐ మీదే ఓ సివిల్ దావా సొంతంగా వేసి, ఓ వారం క్రిందట విజయవంతంగా గ్రీన్ కార్డు సంపాదించాను. ఆలస్యమయినా సరే, ఈ తృప్తి, న్యాయాన్ని సాధించుకున్న ఆనందం వేరే కదా. ఇదంతా రెండు మూడు నెలల్లో జరిగిపోయింది. మీరు గమనిస్తే, ఇక్కడ శాసన వ్యవస్థ బద్దకించింది(నా విషయములో), కానీ న్యాయవ్యవస్థ సరిచేసింది. సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏ వ్యవస్థయితే ఏ మేలుచేయడానికి? ఇక్కడెవడూ గగ్గోలు పెట్టలేదు, ఒకరి వ్యవస్థలో ఒకరు జోక్యం చేసుకున్నారని.

కానీ మన తోలు మందపు నాయకులకిది రుచించేనా?

లోక్ సత్తా లాగా మరీ మంచిగా ఉన్నా మన జనాలకి నచ్చరు. వ్యవస్థని మార్చే అంత శక్తి లేకపోయినా, (కలలు బాగానే కంటుంటాను ఏవో అతీంద్రియ శక్తులు వస్తే, ఈ మన వెధవల్ని మట్టికలిపేద్దామని, ఏ అపరిచితుడు లాంటి  సినిమా చూసినప్పుడు). వ్యవస్థని మార్చే శక్తి లేదు గనక, కొత్త వ్యవస్థలో భాగమయిన ఇలాంటి ** పిల్లలకి ఉన్నంతలో సహాయం చేయటం ద్వారా, మార్పు ఇప్పుడు కాకపోయినా, మరో తరంలో చూడొచ్చనే ఆశ.

నా భూమి పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని ప్రపంచం తెలియని వయసులో చదివినప్పుడు బాగానే అనిపించేది. ఇప్పుడదే చదువుతుంటే, ఎందుకో ఆత్మారాముడు ఆ పదాల్ని జీర్ణించుకోలేక తెగ ఇబ్బందిపడుతూ, ఎందుకురా ఈ ఆత్మ వంచన, ఎన్నాళ్ళు మీ తాతల నేతులు తాగిన మూతుల తాలూకు వర్ణనలతో తృప్తి పడిపోతావ్ అని వెక్కిరిస్తుంటాడు…..

**ఇక్కడే, ఏదో బ్లాగులో పరిచయమయిన లంకె, బ్లాగు గుర్తు లేదు.
 

7 స్పందనలు to “న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ”

  1. రవి వైజాసత్య అన్నారు:

    మీకు ఎట్టకేలకు పచ్చపత్రం వచ్చిన సందర్భంగా అభినందనలు..ఇక్కడ న్యాయవ్యవస్థ అతిగా తయారవుతున్నదని గగ్గోలు పెడుతున్నది న్యాయం అమలుచేస్తున్నదని కాదండి. లేని చట్టాలను న్యాయవ్యవస్థ అమలుచెయ్యపూనుకోవటమే చికాకు తెప్పిస్తుంది.

  2. వికటకవి అన్నారు:

    @రవి గారు,

    ధన్యవాదాలు. దౌర్జన్యం చేసినవాణ్ణి అరెస్టు చేసి జైల్లో పెట్టండి అని కోర్టు చెప్తే గానీ చేయలేని అసమర్ధతలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంటే, సత్వర న్యాయం లభించేది ఏ వ్యవస్థ ద్వారా వచ్చినా స్వాగతించాలని నా భావన.

    తెవికీ వైపు వచ్చి చాలా రోజులయింది, ఆ మాటకొస్తే బ్లాగుకే గాప్ వచ్చిందనుకోండి. త్వరలో వస్తాను, నే చేయాల్సినవి అసంపూర్తిగా ఉన్నాయి.

  3. vookadampudu అన్నారు:

    అవునండీ, న్యాయవ్యవస్థకి అన్యాయవ్యవస్థకి మధ్య అభిప్రాయబేధాలు మొదటినుండి వున్నవే. ఈ మధ్య ప్రశ్నోత్తరాలకు డబ్బులు తీసుకున్న ఘటనలో కూడా కోర్టు జోక్యాన్ని చాలాగట్టిగా ప్రతిఘటించారు మహానుభావులు.

    మీకు ఆకుపచ్చకార్డు రావటానికి ఇన్నేళ్లు పట్టిందా? మాదేశంలో ఐతే, ఎన్నికలొస్తున్నాయంటే, వద్దన్నా ఇంటికొచ్చే ఇస్తారు గులాబీ/తెల్ల కార్డులు. :)

  4. vookadampudu అన్నారు:

    “మాదేశంలో ఐతే” అని ఆ సందర్భాన్ని బట్టి అన్నాను గాని, మీది వేరే దేశమని నా ఉద్దేశ్యం కాదు. పెద్దమనసుతో మన్నించాలి.

  5. రాకేశ్వర రావు అన్నారు:

    హృదయభాను టపా చాలా బాగా చెప్పారు…
    నాకూ ఈ మధ్య ఆంధ్రదేశం గురించి తలచుకుంటుంటే మంట పుడుతుంది.
    ఈనాడు పేపరు చూస్తే.. ఏదో చావు వార్త పట్టుకువచ్చే కాకిని చూసినట్లు… చరాకేస్తుంది. అయినా చూడక తప్పదుగా…
    టీవీలో వార్తలయితే చూడడం మానేశా…

  6. వికటకవి అన్నారు:

    @రాకేశ్వరా, ధన్యవాదాలు. ఊదం గారూ, మొదటిసారి చదివినప్పుడే ఆ ఆలోచన రాలేదు. కాబట్టి ఏ సమస్యా లేదు.

  7. నేమాని రామక్రిష్ణ అన్నారు:

    “నా భూమి పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని ప్రపంచం తెలియని వయసులో చదివినప్పుడు బాగానే అనిపించేది. ఇప్పుడదే చదువుతుంటే, ఎందుకో ఆత్మారాముడు ఆ పదాల్ని జీర్ణించుకోలేక తెగ ఇబ్బందిపడుతూ, ఎందుకురా ఈ ఆత్మ వంచన, ఎన్నాళ్ళు మీ తాతల నేతులు తాగిన మూతుల తాలూకు వర్ణనలతో తృప్తి పడిపోతావ్ అని వెక్కిరిస్తుంటాడు…”
    చాల బాగ చెప్పారు సార్. నేను నా మిత్రులు కూడ ఇదే మాట అనుకుంటూంటము

ప్రత్యుత్తరమిమ్ము