తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ధార్మిక, సామాజిక కార్యక్రమాల సూచి కొండవీటి చాంతాడంత ఉంటుంది. శరణాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రచురణలు వగైరా వగైరా. ఇవన్నీ కూడా గాదె కింద పదికొక్కులు తినగా వస్తున్న ఫలితాలు. లేకపోతే ఇంకా ఎంత మందికి ఉపయోగపడేవో.
పుస్తకాల విషయానికి వస్తే, చిన్నప్పుడు బాలభారతి పేరుతో గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు చిన్నవిగా పిల్లలకోసం వేసేవారు. తెనాలి రామకృష్ణ, భీష్ముడు, వ్యాసరాయలు మొదలైనవి. ఇవి చాలా భాషల్లో పిల్లల్లో చాలా ప్రాచుర్యం పొందాయి.
సాహితీ పరంగా రచయితలని ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో ఇతిహాస, సంస్కృతీ సంబంధమయిన రచయితలకు వారి ప్రచురణ ఖర్చుల్లో 25% - 30% వరకు ధన సహాయం చేస్తున్నారు. మన ఆంధ్ర దేశంలో సాహితీ ప్రయోజనాలకి ఈ కార్యక్రమాలు ఎంతగా ఉపయోగపడ్డాయో చెప్పనలవికాదు. ఉత్తరభారతానికి గీతా ప్రెస్సు, ఘోరఖ్పూర్ ఎంతో దక్షిణాదికి తి.తి.దే అంతని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
కొన్ని కొన్ని ప్రాజెక్టులు తి.తి.దే వారికి చాలా పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి కవిత్రయ భారతం ప్రాజెక్టు. కవిత్రయ విరచిత భారతానికి అక్కడక్కడా మూల సంస్కృతాన్ని ఉదహరిస్తూ అనేక సంపుటాలలో ప్రతిపదార్ధతాత్పర్య సహితంగా ప్రచురిస్తూ వచ్చారు. ఈ మధ్యే అవి నా వద్దకు చేరాయి. ఇప్పుడిప్పుడే చదవటం మొదలుపెట్టా. అందులో ముఖ్యంగా శాంతిపర్వంలో భీష్మ-ధర్మరాజు యొక్క ప్రశ్నోత్తరాలు చాలా ఉన్నతముగా ఉంటాయి. రాజధర్మాల గూర్చి ఎంత లోతుగా చెప్తాడో కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యమేస్తుంది. రాజధర్మము గూర్చి భీష్ముడు చెప్పే మాటలు నేటికీ శిరోధార్యమే. మచ్చుకి.
ఆ:
కోరి తోటవాడు కుసుమ ఫలంబులు | కోయునట్లు రాజు కొనగవలయు
నప్పనములు; నరికి యంగారములు చేయు | భంగి యైన భూమి పాడు గాదె?
తా:
తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్లుగా రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. అట్లా కాక ఫలపుష్పాదులు ఇచ్చే చెట్లను నరికి నిప్పుపెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సమ్రక్షిస్తూ కప్పం గ్రహించాలి.
కం:
తను హీనుండని యెరుగక | మును ప్రబలునితోడ శీఘ్రమున సంధానం
బొనరింప వలయు నతనికి | ధనం బొసంగియైన బతికి దగు నిల గావన్
తా:
తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే, తనకంటే బలవంతుడైన శత్రువుతో వెనువెంటనే సంధిచేసికొనుట అవసరం. చివరకు శత్రువుకు ధనమిచ్చి అయినా సరే, తన రాజ్యాన్ని సంరక్షించుకోవటం రాజధర్మం.
రత్నాలు ఇలాంటివెన్నెన్నో…
అలాంటి తి.తి.దే ఆస్థులని దోచుకోవాలనుకునే ఏ ప్రభుత్వ దురాలోచననయినా మనం ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి. లేకపోతే ఆస్థుల నాశంతో పాటు, ధార్మిక కార్యక్రమాలకీ తీవ్ర విఘాతం జరిగితీరుతుంది.

