ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు

ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన చంద్రబోసు గారు చాలా మంచి పాటలు అందించారు గతంలో. పోనీ డబ్బింగు సినిమానా అంటే అదీ కాదే. ఇలా రాసేంత క్లిష్టపరిస్థితులేమిటో మరి…

ఇక పాట విషయానికొస్తే,

అమ్మడికి కాఫీ కలిపి, కంచం కడిగి, వెనక నక్కుతూ ముందు మొక్కుతూ ఉండే వాడు కావాలిట… అంటే ఉత్త చవట, వెన్నెముక లేనివాడు అనేగా. అబ్బాయికి బైకెక్కి, బ్యాకు నొక్కి, చితక్కొట్టుడు కొట్టని, బట్టలు ఇస్త్రీ చేసేది కావాలిట. ఇదీ సాహిత్యం వరస. ఇంకా నన్ను బాగా హింసించిన వాక్యాలివి.

తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి (ఇది హీరోగారి పలుకండోయ్)
నా అప్పు తానే తీర్చాలి (పూర్తిగా సిగ్గుశరం వదిలేశాడు..వీడి అప్పు తీర్చే అమ్మాయి కావాలా, ఇదెక్కడి డ్యూయెట్టురా దేవుడా). ఉదయాన్నే అయిదింటికొస్తే తలుపు తియ్యాల్ట. (మా ఇళ్ళల్లో తలుపు తీస్తారు గానీ, అలా రోజూ వస్తే మొహాన పేడనీళ్ళు చల్లుతారు బాబూ.)

ఈ లెక్కన సినిమాకి పాట రాయలేనిదెవడు? చూస్తూ, వింటూ ఆనందించండి దిగజారిన మన సినీ సాహిత్యాన్ని.

****************************************

ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు

నా కాఫీ  కలిపేవాడు నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి

నా కూడా వుండేదీ నా డ్రెస్సే పిండేదీ
నన్నే ఇస్త్రీ చెయ్యనిది నాక్కావాలి

నా చేత చిక్కేవాడు నా వెనక నక్కేవాడు
నా ముందు మొక్కేవాడు నాక్కావాలి

నా బైకే ఎక్కేదీ నా బ్యాకే నొక్కేదీ
నన్నొదిలి చెక్కెయ్యనిది నాక్కావాలి

సరి అయిన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరు
ఎన్నో అందించేవాడు ఎదురేదీ అడగనివాడు
ఏటీయెం అయ్యేవాడు ఎవడు ఎవ్వడు ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవడు హేయ్….

మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ వుండని వాడే కావాలి
తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి
అమ్మాయీ,ఆంటీస్ అసలెవ్వరివంక చూడని వాడే కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తను పలకాలి
ఎంతందంగా వున్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి
నా అప్పు తానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు
పాతికేళ్ళ పసివాడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్….

పెళ్ళే అయ్యాక ఇక లవ్వో గివ్వో ఆడే వాడే కావాలి
లవ్వే చేసాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి యేడు సాయంత్రం లోగా ఇంటికి తానే రావాలి
ఐదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళు నాకు కావాలి
జోకులు చెప్పి నవ్విస్తూనే ఉండాలి
కన్నీళ్ళు కూడా కలగాలి
ఆ నా ప్రశ్నకు బదులైనోడు నా మనసుకు మ్యాచ్ అయినోడు
నా సొగసుకు సూట్ అయినోడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్….

నా కోసం పుట్టే వాడు నా కోసం బ్రతికే వాడు
నా కోసం చచ్చే వాడు ఎవడు..
************************************

15 స్పందనలు to “ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు”

  1. Vamsi M Maganti అన్నారు:

    ఇలాంటిదే మరోపాట -

    కాలం కలిసొస్తే
    దేవుడు దిగివస్తే
    మంచం మీదకి
    నలగని బెడ్ షీటే అడగాలి

    అని ఉదిత్ నారాయణుడు - వెంకి బాబుకి గాత్రం ధారపోసి

    రాజస్థాన్ లో
    ఒంటెలకన్నా
    నువ్వే హైటేలే

    అని ఆ పాడిన ఆవిడ ఎవరో కూడా తెలీకుండా - సౌందర్య గారు రెచ్చిపోయి పాడుకుంటున్నారు…

    ఏ సినిమాలోదో కూడా నాకు తెలీదు, వెంకటేశ్ - సౌందర్యల జంట - కడుపులో అంతా దేవేసింది…మొత్తం పాట వింటే మాయలమరాఠీ చేతిలో పెట్టినట్టు అవుతుంది అని విననుకూదా వినలేదు…ఓపిక ఉంటే దీని మీద కుడా బ్లాగండి

  2. ప్రవీణ్ గార్లపాటి అన్నారు:

    బాబోయ్… వద్దు.

  3. Ram అన్నారు:

    ఒక పన్నెండు పదిహేనేళ్ళ క్రితం జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావు (జొ.రా.రా) ఆంధ్రప్రభలో పేరడీలు రాశాడు. అందులో తెలుగు సినిమా పాటల గురించి ఒక విలువైన మాట అన్నాడు -
    తెలుగు సినిమాకి పాట రాయడం
    పందికి ఎనీమా చెయ్యడం.

  4. నిషిగంధ అన్నారు:

    ఈ పాట, అందులో అనుష్క డాన్స్ అంటే నాకు బోల్డంత చిరాకు.. ఇలా రాసేంత క్లిష్ట పరిస్థితి ఏమొచ్చిందో అనుకుంటే ఈ మధ్యన ఈటివిలో ‘బీట్స్ ‘ అనే ప్రోగ్రాం లో ఒక నిర్మాత (గొప్పగా) చెప్పాడు, పాట ఒరిజినల్ వర్షన్ అంత గొప్పగా లేదంట.. అది ‘మామూలు ‘ జనానికి వెంటనే చేరేలా తనే పదాలు మార్చానని! అదీ సంగతి :-)

  5. వికటకవి అన్నారు:

    @వంశీ, హహహ.. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదండోయ్. చెవిటిది, మూగది, కుంటిది వగైరా అన్ని అవలక్షణాలున్నాయేమో. లేకపోతే, దేవుడొచ్చి అడిగితే నలగని బెడ్డుషీట్ అడిగే ప్రేమికులెవరుంటారు చెప్పండి. ఖర్మ గాకపోతే…

  6. tethulika అన్నారు:

    బాగా చెప్పారండీ. ఎటోచ్చి సినిమా పాటలే కాదు. మనపత్రికలలో భాష చూస్తుంటే, నాకు తెలుగంటే ఏమిటో తెలీకుండా పోతోంది.

  7. kasyap అన్నారు:

    ఈ బ్లాగులు చదవనిది ఈ టపాలు తెరవనిది
    తెలుగంటే తెలవనిది నాక్కావాలి

  8. నువ్వుశెట్టి బ్రదర్స్ అన్నారు:

    మరీ ఇంత దారుణమా? అడిగేవాడే లేడు కదా అని, ఇలా అయిపోయింది సాహిత్యం బ్రతుకు. “…మనదీ ఒక బ్రదుకేనా? కుక్కలవలె, నక్కలవలె! మనదీ ఒక బ్రదుకేనా? సందులలో పందులవలె!..” అన్నది దీనికీ వర్తిస్తుందేమో!

  9. Giri అన్నారు:

    నేనైతే ఇలాంటి దారుణాలకి పాల్పడే వాళ్ళని వాళ్ళకి అర్ధమయ్యే భాషలో ఈ విధంగా తూలనాడతాను. ఏమీ అనుకోకండి :)

  10. KRISHNA RAO JALLIPALLI అన్నారు:

    గిరి గారు … అంత సంస్కారంగా తిట్టనక్కరలేదు. బూతులు వాడవచ్చు. తప్పులేదు. సినిమా వాళ్లు వాడగాలేంది మనం వాడితే తప్పా?? ఏమీ ఫర్వాలేదు… మీ ఇస్తాం వచినట్లు తిట్టండి. ఏ నా కొడుకు ఏమంటాడో చూద్దాం.

  11. వికటకవి అన్నారు:

    @ రాం, పందికి ఎనీమానా? బాగా చెప్పారు. అనుమానం లేదు.
    @ నిషిగంధ, నిర్మాతలు కథల్లోనే వేలు పెడతారనుకున్నా, సాహిత్యంలో కూడా వేలెడితే ఇంకేముంది, నా బొంద..
    @ కశ్యప్, దారిలో పడ్డారు. ఇక మిమ్మల్ని సినీ కవిగా గుర్తిస్తున్నానోచ్ :-)
    @ నువ్వుశెట్టి, ఎవరన్నారండీ ఆ మాటలు, అక్షరసత్యాలే.
    @ కృష్ణారావ్, గిరి గారు సంస్కారంగా తిట్టకపోతే మరో సినీ కవి అయిపోతానని భయపడుతున్నారేమో :-)
    @ మాలతి, ప్రవీణ్ భయపడక తప్పని రోజులు మరి ఇవి. అంతే..

  12. రవి వైజాసత్య అన్నారు:

    ఈ బాధ తట్టుకోలేకే ఈ మధ్య సినిమాలో పాటలన్నీ ఫార్వర్డ్ చేసి చూస్తున్నాను.

  13. జ్యోతి అన్నారు:

    మంచి సినిమా చూద్దామని రెండేళ్ళనుండి ప్రయత్నిస్తుంటే ఒక్కటి దొరకటంలేదు. ఈ పాటలు, కథలు చూస్తుంటే సినిమాలంటే విరక్తి కలిగింది. అసలే మంచి పాటలు రావట్లేదు మొర్రో అనుకుంటుంటే పాత పాటలను కూడా ఖూనీ చేస్తున్నారు రీమిక్స్ పేరుతో. అవి టీవిలో చూస్తుంటే నాకు రాని తిట్లు కూడా తిడతాను వాళ్ళని. నిన్నే నిన్నే, రాయే పాయే అంటూ చక్రి పాట వింటూంటే నా రేడియోను నేలకేసి కొడదామన్నంత కోపమొస్తుంది. పైగా ఈనాటి యువతరానికి ఇలాటి పాటలు బాగా నచ్చుతున్నాయి అని గొప్పలు చెబుతున్నాడు. ఆ చక్రి కంటే రైళ్ళలో పాటలు పాడి బిచ్చమెత్తుకునే వారు కోటి రెట్లు మేలు.

  14. lakki అన్నారు:

    eppudu vastunna e patalu bagunnai kani, vatilo ardhale nanardhalu vastunna. ela koncham vinadaniki ebandi ga undhi.

  15. lakki అన్నారు:

    enti enti enti e cinema perlu ….. pokiri, sombheri, kanthri, edeat, stupid assalu cinema chudalanukuntura leda, evarinina e takis lo ye cinema undhi ani adigithe vadu stupid ani ante vadiki manaki madya godava.

ప్రత్యుత్తరమిమ్ము