దీనికి సంబంధించిన మొదటి టపా ఇక్కడ చూడగలరు.
అమితాకృతులు:
ఇందులో అచ్చులు, హల్లులు అటూఇటూ మారుస్తూ లేదా అలా చేయగా ఏర్పడ్డ పదాలు అటూ ఇటూ మారుస్తూ రచనలు చేయటం. ఈ క్రింది శ్లోకంలో నాలుగు పాదాలు ఉన్నాయి. నాలుగు పాదాలు ఖచ్చితంగా ఒకే అక్షరాలు కలిగి ఉన్నాయి, కానీ వాటిని కూర్చిన విధానం వల్ల వేరు వేరు అర్ధాలు గోచరిస్తాయి.
సభాసమానాసహసాపరాగాత్ సభాసమానా సహసా పరాగాత్ |
సభాసమానా సహసాపరాగాత్ సభాసమానాసహసాపరాగాత్ ||
గతిచిత్రాలు:
చిత్రకావ్యాలలో మరో చిత్రం ఇది. ఆంగ్లములో “పాలిండ్రోంస్” గా పిలవబడే పదాలు. ఒక పదము ఎటు నుంచి చదివినా అదే విధముగా పలుకుతుంది. ఉదా: noon,eve
ఈ క్రింది శ్లోకం ఇదే పద్ధతిలో ఉంటుంది.
వారణాగగభీరా సా సారాభీగగణారవా |
కారితారివధా సేనా నాసేధావరితారికా ||
It is very difficult to face this army which is endowed with elephants as big as mountains. This is a very great army and the shouting of frightened people is heard. It has slain its enemies.
చిత్రబంధాలు:
వీటీలో ప్రత్యేకత ఏమంటే, శ్లోకాల తాలూకు అక్షరాలన్నీ గణితానికి సంబంధించిన ఏదేనీ ఒక ఆకృతిలో ఇమిడిపోతాయి. (త్రిభుజం లేదా చతురస్రం). ఈ అద్భుతమయిన శ్లోకం చూడండి ఓ దీర్ఘచతురస్రంలో ఇమిడిపోయింది. (సైజు పెద్దదవటం చేత ఆ చిత్రం విడిగా ఓ టపాలో పెడతాను.)
సా సేనా గమనారంభే రసేనాసీదనారతా |
తారనాదజనా మత్తధీరనాగమనామయా ||
సమస్యా:
ఇందులో గమ్మత్తేమంటే, ఏమీ అర్ధం లేని ఓ కొన్ని అక్షరాల్ని కూర్చి శ్లోకంలోని నాలుగో పాదం చెప్పి, మిగిలిన వాటిని పూరించమనటం. ఓ సారి భోజుల వారు ఓ సమస్యగా కాళిదాసు కిచ్చారట. సమస్యేమంటే, నాలుగో పాదంగా ఈ వాక్యం ఇచ్చార్ట.
ఠఠంఠఠంఠంఠఠఠంఠఠంఠ
దానికి కాళిదాసు పూరణ:
రామాభిషేకే మదవిహ్వలాయా హస్తాచ్యుతో హేమఘటస్తరుణ్యా: |
సోపానమాసాద్యు కరోతి శబ్దం ఠఠంఠఠంఠంఠఠఠంఠఠంఠ ||
ఇదే పుస్తకములో మరోచోట గణిత సూత్రాల ప్రతిపాదన గూర్చి చెపుతూ, క్రీ.పూ.600 నాటి మహర్షి బౌధాయనుని వర్గమూల సూత్రం ఇలా వివరించారు.
కరణీం తృతీయేన వర్ధయేత్తచ్చ |
స్వచతుర్ధేనాత్మచతుర్త్రింశోనేన సవిశేష ఇతి విశేష: ||
Increase the measure by its third and this third by its own fourth less the thirty-fourth part of that fourth. The name of this increased measure is “saviSEsha”.
√² = 1+1/3+1/(3*4)-1/(3*4*34) = 1.4142156
పైథాగరసు ప్రతిపాదనకి (a2 + b2 = c2) కూడా బౌధాయనుడి సూత్రాలు ఉన్నాయి శ్లోక రూపంలో.క్రీ.పూ.600 ఖచ్చితంగా పైథాగరసు కంటే ముందు కాలమే అని నమ్మితే
ఇది నమ్మక తప్పదు మరి.
ఈ పుస్తకములో బాగా నచ్చిన విషయమేమంటే చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితీగా, శాస్త్రీయంగా, చాలా అందంగా, నేర్పుగా చెప్పటం. పది విభాగాలుగా వ్యాకరణము, చిత్రమయిన ప్రక్రియలు, నిత్యజీవితంలో ఉపయోగం ఇతరత్రా విభజింపబడిన ఈ పుస్తకం చదివాక యువకులనుంచీ వృద్ధుల వరకూ అందరినీ తప్పక రంజింపజేస్తుంది అనిపించింది. అంతేకాదు, సంస్కృతం నేర్చుకోవాలన్న అభిలాషనో మన సంస్కృతికి గర్వపడేట్లుగానో, “వేదాల్లోనే అన్నీ ఉన్నాయిట” అని వ్యంగ్యంగా అనే వారికి నాకు తెలిసి కొన్ని వున్నాయి అని తగు సమాధానం చెప్పగలిగే తెగువనో కలిగిస్తుంది అనిపించింది.
దీనికి సంబంధిచిన చిరునామాలు.
శ్రీ అరొబిందో సొసైటీ
పాండిచేరి 605002
ఉత్తర అమెరికాలో :
Antique Collectors’ Club
East works, 116 Pleasant Street, Suite 60B
Easthampton MA 01027
www.antiquecollectorsclub.com


10:59 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 30, 2008
వికటకవి గారు : మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం .. వేనవేల అభినందనలు మరియు నా హృదయపూర్వక శతకోట్ల అభినందనవందనాలు..
వీలుంటే దయచేసి అన్నింటికీ తెలుగులో అర్ధాన్ని వివరించటానికి ప్రయత్నించండి. లేకపోతే ఇలాంటి మీ(ఎవరికైనా సరే) కష్టానికి, ప్రయత్నానికి పరిపూర్ణత సిధ్ధించదు .. కఠినంగా అనిపించినా వాస్తవమైతే ఇదే, నా అభిప్రాయం వరకు.
ఇదేదో అక్షర/పద/పాద/వాక్య పూరణం అనో లేక వాటితో చేయగలిగిన/చేసే చిత్రవిచిత్రవిన్యాసాలనో అనుకుంటే/అనుకోవాలంటే చదవటానికి/చదివేటప్పుడు బాగానే ‘ఆహా/ఓహో/వావ్’ అనిపిస్తుంది కానీ వీటిని ఆ దశ నుంచి పైకి తీసుకు వెళ్లాలి అనుకుంటే … అందరికీ అర్ధమయ్యే తేటతెలుగులో వివరిస్తే మనసుకు హత్తుకు పోవటమే కాకుండా వాటి మరియు ఇచ్చిన/పూరించిన వారి గొప్పదనం క(వి)నిపిస్తుంది.
ఎందుకంటే ఇవి మాములుగా మనం వ్రాసే టపాలు(సమకాలీన సంఘటనలపై) కాదు నాలుగు రోజులు పోయిన తరువాత పట్టించుకోకపోవటానికి లేద పెద్దగా ఉత్సుకత చూపించకపోవటానికి.. ఇవి నా దృష్టిలో అసాధారణమైన/ప్రత్యేకమైన విభాగానికి(కాలం/పరిస్థితులతో సంబంధంలేకుండా లేక తట్టుకోని నిలబడగలిగేవి : నిత్యనూతనం/అజరామరం) చెందేవి (ఉదా : పొద్దులో నిర్వహించిన అభినవ భువనవిజయం) … అక్కడ పొద్దులో నేను ఈ వ్యాఖ్య వ్రాయకపోవటానికి, కారణం వారు పాఠకుల వ్యాఖ్యలకు బదులు ఇచ్చేది చాలా చాలా తక్కువ కనుక నా సమయాన్ని/శ్రమను/ఆలోచనలను అక్కడ వృధా చేయదలచుకోలేదు. అలాగే మరొక బ్లాగ్ (భువనవిజయం) లో కూడా ఒక పద్యానికి అర్ధం వివరించమని కోరినా ఫలితం శూన్యం. కానీ అంత తొందరగా నిరాశావాదాన్ని దరిచేర్చుకోవటం అలవాటులేని వాడిని కనుక మరలా ప్రయత్నిద్దామని ఇక్కడ ఇలా ..
మీరు ఇప్పటికిప్పుడు వ్రాయవలసిన అవసరం లేదు … సమయం చూసుకొని చేయటానికి ప్రయత్నించండి.
వేద గణితం అనేది ఒకటుందని తెలియని వయసులో నేను హెచ్చవేతలకు సంబంధించి పదుల సంఖ్యలో కనిపెట్టిన సూత్రాలను ఒక మాసపత్రికకు పంపిద్దామనే ప్రయత్నం ఆలస్యం అవటంతో తరువాత అవే సూత్రాలు మక్కీకిమక్కీ రావటం అవి వేదగణితంలో ఎప్పుడో చెప్ప(వివరించ)బడ్డాయి అని చదివినప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి … గణితం(తెలుగు సాహిత్యం) మీద నాకు మొదటి నుంచీ చాలా ఇష్టం ఉండటంతో తద్వారా ఏర్పడిన పట్టుతో నేను నిజంగా ఎన్ని రోజులు కష్టపడ్డానో వాటిని సూత్రాలుగా చూపించటానికి/మార్చటానికి/చేయటానికి, ఒక మాములు కాకి లెక్కలుగా నేను నా మెదడులో చేసిన వాటిని. మనది(వి) అనుకున్న విషయాలు కూడా కొద్దిపాటి తెలియకపోవటం ఎంత దారుణం అనిపించిన క్షణమది … అందుకే అప్పుడే నిర్ణయించుకున్నా ఎప్పటికైనా ‘అంతా వేదాలలో ఉంది’ అని సరిపుచ్చుకునే/సంతృప్తిపడే స్థాయి నుంచి వాటిని, వాటి ఫలాలను సామాన్యజనానికి అర్ధమయ్యే స్తాయికి తీసుకురావాలి అని మరియు శాస్త్రసాంకేతికగణితసాహిత్య రంగాలలో reinvent the wheel కు చరమగీతం పాడించాలీ అని .. ఎప్పటికైనా దీనికోసం శ్రమిస్తా .. సాధిస్తా …
నాకు వీటి మీద ఉన్న enormous interest ఇంత పెద్ద వ్యాఖ్య వ్రాయటానికి ప్రేరణ. మరీ ఎక్కువగా చెప్పి ఉంటే క్షమించండి.
4:58 అపరాహ్నం వద్ద మే 1, 2008
చాలా కొత్త విషయాలు తెలిసాయి.
మీరు మద్యమద్యలో వ్రాస్తున్న ఇంగ్లీషు పదాలు సరిగ్గా అదే స్థానంలో ఉండటంలేదు. గమనించగలరు.
ఇంకా విరవరణలతో ఇస్తే బాగుంటుంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
3:01 పూర్వాహ్నం వద్ద మే 2, 2008
@ తెలుగువాడిని,
మీ సూచనలు మంచివే. నేనూ రాద్దామనే అనుకున్నాను, కానీ టపా అప్పటికే పెద్దదయింది. ఎప్పుడో రెండువారాల క్రిందటి టపా ఇది. సైజు తగ్గించేదాకా ప్రచురించలేకపోయా. వీలైనంత త్వరలో అర్ధాలు పెట్టే ప్రయత్నం చేస్తాను.
@ బొల్లోజు బాబా,
ధన్యవాదాలు.