ఎవడబ్బ సొమ్మని తేరగ పంచేరు….పొలిటీషియన్సూ

ఒలంపిక్స్ ముగియబోతున్నాయి. భారతదేశానికి సంబంధించినంతవరకూ ఇది ఖచ్చితంగా చిరకాలం గుర్తుంచుకోదగ్గ ఒలంపిక్సే. ఇప్పటికే ఓ స్వర్ణం, ఓ కాంస్య పతకంతో పతకాల పట్టీలో స్థానం సంపాదించుకొని సగర్వంగా నిలబడగలిగింది. నిజంగానే భారతీయులుగా మనందరం గర్వించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఓ చిక్కుంది. చిక్కేమిటి, నా వరకైతే ఇది చింతే.

ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకి ఓ వింత జబ్బు పట్టుకుంది. ప్రజల సొమ్ముని అప్పనంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా దానం, ధర్మం చేసి పారెయ్యటం. మన రాష్ట్రంలో నాకు గుర్తున్నంత వరకూ ఇది మన చంద్రబాబు నాయుడి గారి హయాంలో మొలకలా మొదలై, దిన దిన ప్రవర్ధమానమై ఇప్పుడు ఓ మానై కూర్చుంది.

ఎవరో ఓ క్రీడాకారుడు స్వంతంగానో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతోనో పరిశ్రమ చేసి అంతర్జాతీయంగా పతకాలు తెచ్చాడే అనుకోండి. దేశానికి అది కీర్తి ప్రతిష్టలు తెచ్చే విశేషమే అయినా, మరీ అంత గంగవెర్రులెత్తుతూ దేశ ప్రజలు అంతకన్నా ఢక్కాముక్కీలు తిని సంపాదించి ఖజానాకి నిజాయితీగా జమచేసిన సొమ్ముని అప్పనంగా పళ్ళెంలో పట్టి, తీసుకో అమ్మా, బాబూ అని ఇవ్వటంలో అసలు న్యాయం ఉందా? రాష్ట్రానికీ, దేశానికీ అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్ళు పోరాడటానికి కావాల్సిన సదుపాయాలు లేదా కార్యాచరణ ప్రణాళికలు గట్రా ఏవీ ఉండవు. కానీ బడ్జెటులో జరుపుతున్న కేటాయింపులు (అరకొరయినా) ఏమవుతాయో ఎవరికీ తెలియదు. బూట్లు లేకుండా హాకీ ఆడమంటారు, హైదరాబాదులో ఉన్న ఆస్ట్రోటర్ఫ్ తప్ప దేశంలో ఆ స్థాయి మైదానం మరోటి ఉండదు. పుట్టి బుద్దెరిగిన్నాటి నుంచీ సురేష్ కల్మాడీ తప్ప మరో మనిషి పేరు నేను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  వినలేదు. ఈ మహానుభావుడు చేసే పనేమిటో ఎవరికీ తెలియదు.

సానియా మీర్జా పేరిట కొన్ని కోట్లు కుమ్మరించారు. అమ్మాయి ఆ స్థాయికి రావటానికి కష్టపడింది, ఒప్పుకుంటా, కానీ ప్రభుత్వాల నిర్వాకం కన్నా మొదట్నించీ స్పాన్సర్ అయిన GVK గ్రూపు వల్ల. అన్నేళ్ళు మూల పడిఉన్న యంత్రాంగం ఆ అమ్మాయి ఓ పతకం తెచ్చింది అన్న మాట వినగానే, ఒక్కసారిగా ఆ విజయాన్ని తమ ప్రభుత్వ విజయంగా ప్రచారం చేసుకుందామన్న ఆత్రుతతో ప్రజల సొమ్ము కోట్లు కుమ్మరించటానికి సిద్ధం. తీరా రాశులు కుమ్మరించాక తరచి చూస్తే, అమ్మాయి మళ్ళీ ఆ ధాటితో ఆడిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు రకరకాల కారణాలు, నొప్పులతో ఓటములూ, తప్పుకోవటాలున్నూ.

ఈ వితరణల తంతు ఇలా చాలా కాలం నుంచీ కొనసాగుతోంది. అకాడెమీల పేరుతో విలువైన స్థలాలు కట్టబెట్టటం మరో జబ్బు. ఏ, ఆ క్రీడాకారుడికే స్వతంత్ర్యాన్నిచ్చి ప్రభుత్వ అజమాయిషీలో అవన్నీ జరిపించొచ్చు కదా. అడిగే నాధుడే లేడు. ఇందాక పైన చెప్పిన అమ్మడు కూడా పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడెమీకి స్థలం పొందినట్లు, తాను కూడా పూర్తిగా ఆటలో దిగజారేలోపు స్థలం పొందుదామని విశ్వప్రయత్నాలు అడపాదడపా చేస్తూనే ఉంది. ఈ వితరణలు/సంతర్పణలు మరి కాస్త వికటించి భారతావని అంతా వ్యాపించింది. పోటీలకు ముందుగానే తగిన వనరులు కూర్చి సరయిన మరియు అందరికీ సమ్మాన సౌకర్యాలు, అవకాశాలు కల్పించకుండా  ఎవరో ఒకరో ఇద్దరు సహజంగా అబ్బిన ప్రతిభతోనో లేదా స్వతహాగా అమర్చుకున్న సౌకర్యాలతోనో గెలిస్తే, అప్పుడు ఎగబడి, విరగబడి వాళ్ళని నెత్తిమీద ఎక్క్కించుకోవటం దిగజారుడుతనానికి పరాకాష్ట. వీళ్ళకి ప్రోత్సాహం సంగతి దేవుడెరుగు, అరకొర సౌకర్యాలలో సాధన చేసి, చెమటోడ్చి నెగ్గలేకపోయిన వారి గతేమిటి? నాకు తెలిసి ఇలా కోట్లు సొంతం చేసుకున్న వాళ్ళల్లో ఒకరో ఇద్దరో మళ్ళీ ఆ స్థాయి ఫలితాలు తెచ్చి ఉంటారేమో.

యధాప్రకారం ఒలంపిక్స్ విజేతలకి అప్పుడే కుమ్మరింపులు మొదలయ్యాయి. ఒకడు జీవితకాలం మొదటి తరగతి ఏసీ ప్రయాణం అంటాడు, మరొకడు జీవితకాలం విమాన ప్రయాణమంటాడు. ఈ లెఖ్ఖన ఆటగాళ్ళని జీవితకాలం ప్రజాప్రతినిధిగా నామినేట్ చేసే రోజు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ఆశ్చర్యకరమైనా ఉన్న నిజమేమంటే, మనం మన చేతుల్లో నుంచి జారిన డబ్బుని మనది కాదు అని నిర్ణయించేసుకుని, మన జేబులో ఉన్నదే మన డబ్బు అని ఎంతో అమాయకంగా మనల్ని మనం నమ్మించుకుంటాం. ప్రభుత్వ ఖజానా మనది కాదు, రాజకీయ నాయకులదే అని సెటిలైపోతాము. ఈ విషయంలోనే ప్రాక్ పశ్చిమ దేశాల్లో తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. “పన్నుదారుల డబ్బు” అంటే ఆ దేశాల్లో చాలా శాతం నాయకులకి అది తమ డబ్బు అన్న స్వేచ్ఛ కన్నాప్రజల డబ్బు అన్న హెచ్చరిక చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేలా  సమాజం వెంటపడుతూనే ఉంటుంది. అది మన దేశంలో లేనప్పుడు  “ఎవడబ్బ సొమ్మని తేరగ తింటావు లేదా పంచుతావు…” అని పాడుకోవటంలో అర్ధం లేదేమో కూడా.

అసలు ఇలా ప్రణాళికలని పక్కన పెట్టి ప్రతిభ అంటూ అడ్డగోలుగా ఇస్తూ పోతే ఓ IAS,IPS,IIS,IIM,IIT,ACS,CWA,CA వీటన్నిట్లో టాపర్లకి లేదా ఇతర రంగాల్లో విదేశాల్లో పేరు తెచ్చినవారికి ఏటా ఎంతెంత కుమ్మరించాలిట? ఏం వీటిల్లో ప్రతిభ మన దొడ్లో కాసే జామకాయలా, ఏ కష్టమూ పడకుండానే కాయటానికి? లేదా క్రీడల్లో ప్రతిభ మరింకే ప్రతిభకీ అందనంత అసాధ్యమైనదా?

ఏ నాటికి బుర్ర పెట్టి వాస్తవంగా ఆలోచిస్తారో?

21 స్పందనలు to “ఎవడబ్బ సొమ్మని తేరగ పంచేరు….పొలిటీషియన్సూ”

  1. నెటిజన్ అన్నారు:

    పుల్లెల గోపిచంద్‌ని నువ్వేవరు అని ఒక మంత్రి వర్యుడు అడిగాడంట!

  2. సుజాత అన్నారు:

    అమ్మ, మీరొక్కరు అర్థం చేసుకున్నారండి నా బాధ! ఈ పాయింటు నిన్న నేను లేవనెత్తితే మా చుట్టుపక్కల దేశభక్తులందరూ ‘ఇంకా నయం, ఇన్నాళ్లకి రాక రాక రెండు(అప్పటికి మూడోది ఖరారు కాలేదు) పతకాలొస్తే, అంత మాట అంటావా? వాళ్ళు తెచ్చిన ఖ్యాతికి ఇది ఏ మూల?” అని పోట్లాడారు.

    అసలు ఈ స్థాయిలో ప్రజా ధనం వారికివ్వడం వల్ల , వాళ్ళు ఇకపై సీరియస్ గా ఆడటం కంటే ఆడకపోవడానికే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒలింపిక్ స్థాయి క్రీడాకారుడన్న పేరూ వచ్చేసి ఉంటుంది, చేతినిండా డబ్బూ ఉంటుంది కదా! మన వాళ్ళు ఆర్థిక స్థిరత్వం కంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? సానియా చూడండి, గాయాలు, నొప్పులు! ఏవన్నా అంటే “అసలు నేను దుబాయిలో సెటిల్ అయి అక్కడినుంచే ఆడతా” అనే స్థాయిలో ఆలోచించడం!నగరం నడిబొడ్డులో 10 ఎకరాల స్థలం కావాలట పాపకి! (ఎవడబ్బ సొమ్మనో!)

    వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలసిందే కాని మరీ కోట్లు కుమ్మరించి కాదు.(ఒకవేళ ఇచ్చినా మళ్ళీ ఒలింపిక్స్ లో పతకం సాధించకపోతే ఇవి వెనక్కి ఇవ్వాలి అనే లొసుగు పెడితే ఎలా వుంటుందో)

  3. ప్రసాద్ అన్నారు:

    బాగా చీల్చి చెండాడారు.
    ఛస్తే డబ్బివ్వడం, గెలిస్తే డబ్బివ్వడం తప్ప మీరన్నట్లు అందుకో ప్రణాళికా పద్దతీ ఏమీ అక్కరలేదు. మన వెధవతనం పదిలంగా వున్నంత కాలం వీళ్ళలాగే చేస్తూ వుంటారు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. సూర్య ప్రకాశ్ బాబు అంబటి - ఆష్ట్రేలియ అన్నారు:

    బాగా చెప్పారు. పబ్లిక్ ఇంట్రెష్ట్ లిటిగేషన్ వెయ్యాలి.

  5. చైతన్య క్రిష్ణ పాటూరు అన్నారు:

    “పన్నుదారుల డబ్బు అంటే ఆ దేశాల్లో చాలా శాతం నాయకులకి అది తమ డబ్బు అన్న స్వేచ్ఛ కన్నాప్రజల డబ్బు అన్న హెచ్చరిక చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేలా సమాజం వెంటపడుతూనే ఉంటుంది” - perfect.
    మన సమాజంలో ఇదే లోపించింది. వేలకు వేలు పన్నులు రూపంలో, ఇంకా బయట కనపడని రూపాలలో ప్రభుత్వానికి చెల్లించి, మళ్ళీ వాళ్ళిచ్చే నువ్వుగింజలకి ఆనందపడే అజ్ఞానం జనాలకి అలవాటయ్యింది. జనం డబ్బుకి లెక్క చెప్పే బాధ్యత లేకుండా, ఇష్టానికి వాడుకోవటం నాయకులకు అలవాటయ్యింది.

  6. సుధాకర్ అన్నారు:

    అవును నిజమే, అమ్మడు సానియా యూ.ఎస్ ఓపెన్ నుంచి తప్పుకుందని ఇప్పుడే చదివొస్తున్నా. ఎడమకాలి చిటికెనవేలి గోరు నొప్ప్పంట :-)

  7. సుజాత అన్నారు:

    మధ్యలో గాయంతో వైదొలగడం సరే! ఒలింపిక్స్ ప్రారంభ ఉత్సవాలకు ‘ఇప్పటి దాకా ప్రాక్టీస్ లో ఉన్నాను ‘ అనే వంకతో కనీసం దేశ వస్త్ర ధారణలో కూడా కాక ప్రాక్టీస్ చేసిన డ్రెస్ లోనే కాజువల్ గా సానియా రావడాన్ని నేను గర్హిస్తున్నాను. ఒక అంతర్జాతీయ ఈవెంట్ లో దేశాన్ని ఇలాగేనా రిప్రజెంట్ చేసేది? చీర కాకుండా ఇంకేదైనా ఫాషన్ కాస్ట్యూం లొ అయితే రెడీ అయ్యేదేమో ! sorry, this comment is out of context.

  8. శ్రీ అన్నారు:

    ఇరగదీసారు.
    పుల్లెల గొపీచంద్ స్థలం వెంకట్ లాక్కుని బెదిరించిన సంఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
    సాంక్షన్ చేసిన డబ్బులు వాళ్ళకి చేరుతాయా అసలు?మద్యలో నాయకులే నొక్కరు కదా?

  9. చిలకపాటి శ్రీనివాస్ అన్నారు:

    పత్రికలూ దీన్ని గురించి నోరు మెదపవు. కానీండి, మొదలు పెట్టారుగా; ఇదే ఆలోచనాధోరణి ఉన్న నలుగురూ కలుస్తారు, పది మందవుతారు. ఎవరో ఒకరు వాళ్ళను నిలదీసి అడిగే రోజూ దగ్గరపడుతుంది.

  10. Srividya అన్నారు:

    చాలా మంచి పాయింట్.డబ్బున్న వాళ్ళు సొంత డబ్బులతో కోచింగులు గట్రా తీసుకుని గెలిచి ఇలా రివార్డులు తీసుకుంటారు. మరి లేనివాళ్ళ సంగతి..?
    గెలిచిన తర్వాతే తాయిలాలు అంటే వాళ్ళ ప్రతిభకి పదును ఎలా పెట్టుకోగలరు..? ఎలా గెలవగలరు..? అసాధారణమైన ప్రతిభ వుంటే తప్ప.

  11. ప్రవీణ్ గార్లపాటి అన్నారు:

    నాదీ అచ్చంగా ఇవే ఆలోచనలు. ప్రోత్సాహించాలంటే కోట్లు గుమ్మరించి డబ్బులూ, స్థాలాలూ ఇవ్వాల్సిందేనా.
    ఏ ? వాళ్ళకి ఇకపై కావలసిన ట్రెయినింగూ, ఎక్విప్‌మెంటూ ప్రభుత్వం చూసి ఇంకా ఎన్నో మెడల్సు సాధించేలా ప్రోత్సాహిస్తే చాలదా ?
    అలాగని అంత సాధిస్తే ఏమీ ఇవ్వకూడదని కాదు. అడ్డూ, అదుపూ లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రజల సొమ్ము ఇచ్చెయ్యడమేనా…

  12. వికటకవి అన్నారు:

    @ సుజాత, అసలు సానియా ఇంక మళ్ళీ గెలుపు బాట పడుతుందన్న నమ్మకం నాకేనాడో పోయింది.
    @ప్రసాద్, నెటిజన్, సుధాకర్, చైతన్య,శ్రీ,శ్రీనివాస్,శ్రీవిద్య,ప్రవీణ్ కృతజ్ణతలు.
    @సూర్య, తప్పదు అదే చెయ్యాలేమో. కానీ అక్కడా పిల్ పిటిషన్లెక్కువయ్యాయని కోర్టులు విసుక్కుంటున్నాయి.

  13. Aruna అన్నారు:

    జనాభాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి ని ఇచ్చినా, మన మంత్రులు పతక విజేతలకు ఇస్తున్న డబ్బు కు కొన్ని రెట్లు వుంటుంది. క్రీడల్లో మనం కూడా ఇంత ప్రగతిని సాధించగలం అని, విశ్వాసాన్ని మనలో పెంపొందించినందుకు ఇవ్వాలి అంత డబ్బు ని. ఖచ్చితం గా వారికి జీవితకాల వుచిత ప్రయాణం కల్పించాలి. గాంధీ గారి లాగ కొల్లాయి గుడ్డ కట్టుకు తిరిగితేనే కష్టపడ్డట్టా? దరిద్ర నారాయణుడూ అంటు డైలాగులు చెప్తేనే సన్మానికి, శిలా విగ్రహాలకి అర్హులా? క్రీడాకారులు కష్టపడి స్పాన్సర్స్ ని వెదుక్కుని అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తే, మన దేశానికి, తద్వారా మనకు గొప్ప కాదా? వ్యక్తి పూజ కి నేను కూడా వ్యతిరేకినే. కాని వారిలోని కార్య దీక్షని అభినందించలేకపోతే ఎలా? నన్ను అడిగితే ఇంకా డబ్బులు ఇవ్వాలి. అలాంటి వాళ్ళలో ఒకళ్ళని క్రీడల మంత్రి ని చెయ్యాలి, పార్టీలతో సంబంధం లేకుండా. వారికి ఇంకా కొన్ని సౌకర్యాలని, తద్వారా బాధ్యతలని కట్టబెట్టడం అనే మీ ఆలొచన బాగుంది. విజేతలకి సౌకర్యాలే కాదు, వారి జూనియర్లని తీర్చి దిద్దే బాధ్యత ని కూడ అప్పచెప్పాలి.

  14. Aruna అన్నారు:

    ఇంకొక అభిప్రాయం. విజయాలు సాధించి పతకాలు తెస్తేనే క్రీడాకారులకి పరిపూర్ణత అనుకుంటే ఎలా? సానియా మీర్జా లాంటివాళ్ళు attitude show చెయ్యగానె తిట్టేస్తే ఎలా. మన దేశలో క్రీడలకి, క్రీడాకారులకి ప్రొత్సాహకాలు తక్కువ అని అందరు వొప్పుకునేదే కదా.. అందుకే దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకునే నైజం బయలుదేరింది కొందరిలో. క్రీడలకు encouraging గా ఒక structure లేకపోవడం అసలు దోషం. sports quota లో engineering లో seat వస్తుందని మా friend ఒకరి ఇంట్లో ఆటలకి వెళ్ళనిచ్చారు. మీ టపా ని విమర్శించడం నా వుద్దేశం కాదు. చర్చకి ఇంకొక angle ని provide చెయ్యాలని నా ప్రయత్నం.

  15. Purnima అన్నారు:

    టపా, అటు తర్వాత వ్యాఖ్యలూ చదివీ పూర్తి అయోమయంలో పడ్డాను. నా అజ్ఞానాన్ని మన్నించి, నేను అర్ధం చేసుకున్నది సరియైనదో కాదో తెలియజేయగలరు.

    ఇప్పుడు ఒక క్రీడాకారుడి తీసుకుందాం. పదేళ్ళ వయస్సు నుండే ఆ ఆట మీద మనసు లగ్నం చేసి శ్రమిస్తున్నాడనుకుందాం. మొదట్లో తల్లిదండ్రులే అన్నీ అమర్చినా, అటు తర్వాత స్థాయి పెరిగే సరికి, బయట నుండి సాయం తీసుకోవాల్సి వస్తుంది. అదృష్టం కొద్దీ ఓ పెద్ద కంపెనీ స్పాంన్సర్స్, విదేశీ కోచ్ కుదిరారు. అన్నీ కలిసి వచ్చి కష్టం ఫలించి ఓ పతకం వస్తే, ఇప్పటి దాకా ఈ క్రీడాకారుణి జీవితంలో ప్రభుత్వ పాత్ర లేదు కాబట్టి, ఈ విజయాన్ని చూసీ చూడనట్టుండి “ప్రజల” సొమ్మును వృధాగా “దానం” చేయటం దేనికి అని అడుగుతున్నారా?

    మీరన్నట్టు క్రింది స్థాయిలో ఎటూ సరియైన సదుపాయాలు లేవు. “సహజంగా అబ్బిన ప్రతిభతోనో లేదా స్వతహాగా అమర్చుకున్న సౌకర్యాలతోనో గెలిస్తే..” అప్పుడు కూడా “గుర్తింపు” రాకపోతే ఎలా? అభినవ్ కోటీశ్వరుడు అవ్వటం వల్లే పతకం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు (మీరు కాదు, చాలా మంది)? కేవలం డబ్బులు లేకపోవటం వల్ల కెరీర్స్ నాశనం అవ్వచ్చుకానీ, డబ్బుతో కెరీర్ కొనుక్కోలేము. అభినవ్ కి డబ్బు సమస్యలేదు, అయినా అనారోగ్యాన్ని జయించాల్సి వచ్చింది. అది పక్కకు పెడితే ఇప్పుడు నేనే ఓ ఆషామాషీగా నిర్వహించే గల్లీ ఆటల పోటీలోనో పాల్గొంటే, అక్కడ ఇచ్చిన చీపురు పుల్లో, ఊదడానికి పనికిరాని బుడగో, నా ప్రతిభకు “గుర్తింపు” గా గుర్తిస్తాను. అవి మా ఇంట్లో చాలా ఉన్నాయనిపించినా, “ప్రైజ్ మనీ, ప్రైజ్ మనీ”యే!అసలు ముందు నుండీ ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేకపోవటమే దారుణమనుకుంటే, గెలిచాక కూడా ఇవ్వద్దనటం (?) నాకస్సలు బోధపడటం లేదు.దయచేసి వివరించగలరు.

    ఇకపోతే క్రీడాకారులకే ఇంత ప్రాధాన్యత ఎందుకు? నాకు స్విస్ దేశ ప్రధాని తెలీదు, రోజర్ ఆట తెలుసు. స్పేన్ ఎక్కడుందో తెలీదు, కానీ రఫా ఎలా రఫ్ ఆడిస్తాడో తెలుసు. అమెరికాలో ఎన్ని రాష్ట్రాలున్నాయో తెలీదు నాకు మైకెల్ ఫెల్ప్స్ ప్రతిభ తెలుసు, కొంతమంది హాలివుడ్ ప్రముఖుల గురించి తెలుసు. వారి వారి దేశాలకు వీరు ఎక్కువ ప్రాచుర్యం తేగలిగే “ambassadors”!! ఇక్కడి వరకూ ఇది నా నేల, ఇదో ఇదంతా నా నీరు, ఆకాశంలో ఇంత గాలి నాది మాత్రమే అని హద్దులతో నిండిపోయిన ప్రపంచంలో మనమంతా మనుషులమే అనీ, మనలో ఎన్ని తేడాలున్నా మనల్ని కలిపే సన్నని దారం ఏదో ఉందని గుర్తుచేసేది నా ఉద్ధేశ్యంలో క్రీడాకారులూ, కళాకారులూ! అందుకే వారికంత విశిష్ట స్థానం అని నా అభిప్రాయం.

  16. వికటకవి అన్నారు:

    @ అరుణ,
    క్రీడాకారులని ప్రోత్సహించటానికి, అభినందించటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా అకస్మాత్తుగా, ఆలోచనారహితంగా కాదు. ఒక పద్ధతి ఉండాలి. ఉదా: ఆ ఇచ్చేదేదో/ఇవ్వాలన్కుంటున్నదేదో ప్రభుత్వం ముందే ప్రకటించవచ్చుగదా, ఫలానా పతకం గెలిస్తే ఇదిస్తాం అని. కనీసం అప్పుడు చేయబోయే పంపకాల్లో కనీసం అందరికీ సమాన అవకాశం ఇచ్చాం అన్న నీతి పాటించిన వారవుతారు.

    ప్రణాళిక లేకుండా ఇలా గెలిచినవాడికి ఇష్టమొచ్చినంత ఇచ్చేస్తాం అంటే, దానికో లెక్కాజమా అవసరం లేదా? ఇవ్వాళ కోటి కాస్తా రేప్పొద్దున ౧౦ కోట్లంటారు. సొంతడబ్బైతేనే కదా.

    >>విజయాలు సాధించి పతకాలు తెస్తేనే క్రీడాకారులకి పరిపూర్ణత అనుకుంటే ఎలా?
    కరక్టుగా చెప్పారు. నా బాధ అదే. గెలిచి కోట్లు మూటగట్టుకున్న వారు సరే, మరి అలా శ్రమపడి ఓడిన వారి పరిస్థితేమిటి?

    @ పూర్ణిమ,
    >>గెలిచాక కూడా ఇవ్వద్దనటం
    అవును, గెలిచాక ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలి. ఇచ్చే/ఇవ్వదలచుకునే సొమ్ము (ప్రైజ్ మనీ) ముందు ప్రకటించి (ముందుముందు రోజుల్లో ఓ మార్గదర్శకంగా ఉండేట్లు) ఆ అవకాశంలో పాల్గొనే అందరినీ భాగస్వాముల్ని చెయ్యాలి.

    భలేవారండీ, రోజర్, రఫా, ఫెల్ప్స్ మనకి తెలుసు, ఎందుకంటే ఏదో అషామాషీగా ఒక్కసారి గెలిచారని కాదు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలిచి వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ దేశాన్ని గుర్తుపెట్టుకునేలా మనల్ని చేసారు కాబట్టి. కానీ అభినవ్, సానియా, గోపీచంద్ విదేశీయులకి మన దేశానికి గుర్తింపు తెచ్చేంతగా తెలియరు, ఆ గెలిచిన నెలరోజులు తప్ప. కారణం తరువాత రోజుల్లో నిలకడ(consistency) ఉండకపోవటమే. ఏదో నిరాశావాదంతో మాట్లాడటం లేదు. ఇలా సంతర్పణల చేయటం మొదలైన గత అయిదారు ఏళ్ళ్ళలో ఆ తరువాత మరింత బాగా ఆడిన వారి పేర్లు కొన్ని చెప్పండి.

    ఓవరాల్ అసలు ఈ పద్దతిలేని సంతర్పణలు నాకు నచ్చలేదు. కొత్త టాలెంట్ బయటకి రావటానిగ్గానీ, ఉన్న టాలెంట్ మరింత బాగుపడటానిగ్గనీ ఏమాత్రం ఉపయోగపడవు, పడిన దాఖలాలు ఇప్పటివరకూ ఏమీ కనపడటమూ లేదు.

  17. Purnima అన్నారు:

    హమ్మ్.. ముందే ప్రకటించి పోటీలో ఉన్న అందరినీ భాగస్వామ్యం చేస్తే, డబ్బులు ఎర వేస్తున్నారు అనేవారూ ఉంటారేమో. మనకి విధానాలే లేవు, ఉన్నా అవి పూర్తిగా అవకతవకలమయం. పూర్తిగా ప్రక్షాళన జరిగితే ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో కానీ, ఉన్న పరిస్థితుల్లో కూడా కాదు.

    ఇక నేనా క్రీడాకారుల పేర్లు ఎందుకు చెప్పానంటే, ఆట సరిహద్దులు దాటి మనుషులను ఏకం చేయగలదూ అని చెప్పటానికే! అన్నట్టు స్పేన్ లో వీధుల్లో విశ్వనాథన్ ఆనంద్ చిట్టూ జనాలు మూగిపోతారనీ, గోపిచంద్ ని ఇంగ్లండ్ చాంపియన్ షిప్ నెగ్గిన ఊరిలో బాగా గుర్తుపడతారనీ చదివాను. మన వారి విలువ మనకి తెలియడం లేదేమో! అంతే!

    మీ అభిప్రాయాల్ని చక్కగా చెప్పటమే కాక, విభేదించిన నాకూ తగిన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు!! ఆలోచించాల్సిన విషయం.

  18. శిరిగిన సీను అన్నారు:

    పతకాలు గెలిచిన వారి ప్రతిభను గుర్తించి, వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒక పారితోషకం ఇవ్వడంలో నాకు తప్పు ఏమీ కనబడటం లేదు. ఇక ఎవడబ్బ సొమ్ము అంటారా? ఈ ప్రజా స్వామ్యంలో ప్రజలే రాజులు అయినప్పుడు, ప్రజల సొమ్ము కాక ఇంకెవరి సొమ్ము ఇవ్వాలి? గెలిచిన వాళ్ళకి సొమ్ము ముట్టచెప్పడాన్ని కాదు మనం వ్యతిరేకించాల్సింది, మన వాళ్ళు కూడా పతకాలు సాధించగలరు అని తెలిసిన తరువాతైనా, మన ప్రభుత్వం మన క్రీడాకారులకి కావలసిన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని వ్యతిరేకించాలి. గోపీచంద్ కి హైదరాబాద్ లో స్థలం ఇవ్వడం వల్లే (అదీ లీజుకు), ఇప్పుడు ఒక state of the art badminton training center ని ప్రారంభించ గలిగాడు. నిర్వహణ ఖర్చుకు ప్రభుత్వ సహాయం కోసం చూడకుండా కోర్పొరేట్ సంస్థలని ఆశ్రయిస్తున్నాడు. పి.టి.ఉష, మల్లేశ్వరి, గోపీచంద్ లాంటివాళ్ళు వయస్సు పెరిగో, ప్రోత్సాహం లేకో, వారి సామర్ధ్యం సన్నగిల్లి పతకాలు సాధించలేకపోతే, ఇక ఆయా క్రీడల పట్ల వారికున్న ఆసక్తిని చంపుకొని, పొట్టకూటి కోసం వేరే కూలికి పోవలిసిందేనా? అటువంటి వారికి ఆయా క్రీడలను వృద్దిచేసే బాధ్యత అప్పజెప్పడం తప్పంటారా? సానియా స్వంతానికి ఉచితంగా స్తలం ఇవ్వడం తప్పు, కానీ పది ఎకరాలు ఇచ్చి tennis coaching center పెట్టమనడం లో తప్పేముంది. పందికొక్కుల్లాంటి రాజకీయ నాయకులు, రాబందుల్లాంటి ఉన్నతాధికారులు కలిసి ప్రజల భూములు పంచుకోవడం కన్నా, క్రీడలను ప్రోత్సహించడం కోసం ఊపయోగించడంలో తప్పు లేదు, అది మన బాధ్యత కూడా.

    మొన్నామధ్య మన ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఎన్నో ఏళ్ళగా అప్పులు తీర్చని వారికి వడ్డీ మాఫీ చేసిందట. బుద్దిగా అప్పు తీర్చినవాళ్ళు వెధవలు, తీర్చని వాళ్ళు దొరలు. “ఎవడబ్బ సొమ్ము” అని అడగాల్సినది అటువంటి సందర్భాలలో.

  19. వికటకవి అన్నారు:

    @శీను, పూర్ణిమగారికి చెప్పిన సమాధానమే మీకున్నూ. పోనీ మీరన్నట్లుగా ఇచ్చినా ఇకంతేనా, ఆ తర్వాత నిలకడ అవసరం లేదా?

  20. పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం అన్నారు:

    [...] వరాలు ప్రకటించడాన్ని వికటకవి “ఎవడబ్బ సొమ్మని తేరగ పంచేరు…” అని [...]

  21. వేణూ శ్రీకాంత్ అన్నారు:

    భాగా చెప్పారు వికటకవి గారు.
    పూర్ణిమా & శ్రీనివాస్
    ప్రణాలికా బద్దమైన ప్రోత్సాహకాలని ఎవరు వ్యతిరేకించరు కాని రాజకీయ నాయకులు నిబద్దత లేకుండా నోటికి వచ్చిన అంకె చెప్పేసి చేతులు దులిపేసుకోడమే బాగలేదు. రుణాల మాఫీ కూడా అంతే ఎప్పుడో ఒకప్పుడు మాఫీ చేస్తారు లేరా అని సరిగా కట్టకలిగిన వాళ్ళు కూడా ఎగ్గొట్టిన సంధర్భాలు అనేకం. కాస్త పలుకుబడి వున్న వాడే వీటి వల్ల లాభం పొందుతున్నాడు, బలహీనుడి దగ్గర ముందే ముక్కు పిండి వసూలు చేస్తారు.

ప్రత్యుత్తరమిమ్ము