ఇదెక్కడి జల్సా?

ఏప్రియల్ 21, 2008

జీవితంలో కొన్ని సార్లు కొన్ని ఘోరాలు చేస్తుంటాము. అలాంటి ఓ పని చేసి తల బొప్పి కట్టించుకున్నా. బొప్పి కట్టించిన ఆ ఘోరం ‘జల్సా’.

ఇదేదో వెక్కిరింపుగానో లేదా వేళాకోళానికో అడగట్లేదు. ఈ సినిమా చూసి ఎంతో కొంత నచ్చింది అనుకునే వాళ్ళెవరికైనా ‘ మంచి ‘  సత్తా ఉన్న సన్నివేశాలు (సినిమా పక్కనపెట్టండి) ఒక్క మూడంటే మూడు ఉంటే చెప్పండి.

దయచేసి సినిమా సినిమాలా చూడాలి అనకండీ. నేను సినిమాని పక్కా సినిమాగానే చూశా. ఇంకా చెప్పాలంటే సినిమాని సినిమాగా కన్నా ఇంకా నీచంగానే(గ్రేసు మార్కులిచ్చుకుంటూ) చూశా. త్రివిక్రం ఇలా కూడా తీయగలడా అనిపించింది.

నాకేమి నచ్చలేదో అని రాసే కంటే నాకు నచ్చినవి అని రాస్తే పని సులువవుతుంది అనిపించింది.  అదల్లా మహేష్ బాబు గొంతు. అంటే మహేష్ బాబుది అంత గొప్ప గొంతా అని అడగొద్దు. ఈ సినిమాలో ఇదొక్కటే నచ్చింది నాకు :-)

ఇది కాక మరో మూడేవైనా నచ్చితే చెప్పండి. నా బాధల్లా నేనొక్కణ్ణే ఈ జాబితాలోనా లేక నాకు తోడు ఉన్నారా అని తెలుసుకుందామనే.


ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు

ఫిబ్రవరి 18, 2008

ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన చంద్రబోసు గారు చాలా మంచి పాటలు అందించారు గతంలో. పోనీ డబ్బింగు సినిమానా అంటే అదీ కాదే. ఇలా రాసేంత క్లిష్టపరిస్థితులేమిటో మరి…

ఇక పాట విషయానికొస్తే,

అమ్మడికి కాఫీ కలిపి, కంచం కడిగి, వెనక నక్కుతూ ముందు మొక్కుతూ ఉండే వాడు కావాలిట… అంటే ఉత్త చవట, వెన్నెముక లేనివాడు అనేగా. అబ్బాయికి బైకెక్కి, బ్యాకు నొక్కి, చితక్కొట్టుడు కొట్టని, బట్టలు ఇస్త్రీ చేసేది కావాలిట. ఇదీ సాహిత్యం వరస. ఇంకా నన్ను బాగా హింసించిన వాక్యాలివి.

తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి (ఇది హీరోగారి పలుకండోయ్)
నా అప్పు తానే తీర్చాలి (పూర్తిగా సిగ్గుశరం వదిలేశాడు..వీడి అప్పు తీర్చే అమ్మాయి కావాలా, ఇదెక్కడి డ్యూయెట్టురా దేవుడా). ఉదయాన్నే అయిదింటికొస్తే తలుపు తియ్యాల్ట. (మా ఇళ్ళల్లో తలుపు తీస్తారు గానీ, అలా రోజూ వస్తే మొహాన పేడనీళ్ళు చల్లుతారు బాబూ.)

ఈ లెక్కన సినిమాకి పాట రాయలేనిదెవడు? చూస్తూ, వింటూ ఆనందించండి దిగజారిన మన సినీ సాహిత్యాన్ని.

****************************************

ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు

నా కాఫీ  కలిపేవాడు నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి

నా కూడా వుండేదీ నా డ్రెస్సే పిండేదీ
నన్నే ఇస్త్రీ చెయ్యనిది నాక్కావాలి

నా చేత చిక్కేవాడు నా వెనక నక్కేవాడు
నా ముందు మొక్కేవాడు నాక్కావాలి

నా బైకే ఎక్కేదీ నా బ్యాకే నొక్కేదీ
నన్నొదిలి చెక్కెయ్యనిది నాక్కావాలి

సరి అయిన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరు
ఎన్నో అందించేవాడు ఎదురేదీ అడగనివాడు
ఏటీయెం అయ్యేవాడు ఎవడు ఎవ్వడు ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవడు హేయ్….

మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ వుండని వాడే కావాలి
తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి
అమ్మాయీ,ఆంటీస్ అసలెవ్వరివంక చూడని వాడే కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తను పలకాలి
ఎంతందంగా వున్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి
నా అప్పు తానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు
పాతికేళ్ళ పసివాడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్….

పెళ్ళే అయ్యాక ఇక లవ్వో గివ్వో ఆడే వాడే కావాలి
లవ్వే చేసాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి యేడు సాయంత్రం లోగా ఇంటికి తానే రావాలి
ఐదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళు నాకు కావాలి
జోకులు చెప్పి నవ్విస్తూనే ఉండాలి
కన్నీళ్ళు కూడా కలగాలి
ఆ నా ప్రశ్నకు బదులైనోడు నా మనసుకు మ్యాచ్ అయినోడు
నా సొగసుకు సూట్ అయినోడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్….

నా కోసం పుట్టే వాడు నా కోసం బ్రతికే వాడు
నా కోసం చచ్చే వాడు ఎవడు..
************************************


ఓ సినీమా కథ!

సెప్టెంబరు 28, 2007

మొదటి అంకం:

తండ్రి: ఓరే శీను, ఇంత పొద్దెక్కాక ఇంకా లేవవేమిట్రా?
కొడుకు : అబ్బా డాడీ, ఇంకాసేపు పడుకోనీయండి
తండ్రి : ఒరే ఇడియట్, ఇవ్వాళ సోమవారం రా, సెలవ రోజు కాదు. త్వరగా లే.
కొడుకు : అమ్మా చూడవే, ఈ హిట్లర్ తో చస్తున్నా!
తల్లి : ఏవిటీ మీ గోల పొద్దుటి పూట, వాణ్ణి పడుకోనీయండి. అయినా నా చంటిగాడు ఏంచేశాడు?
తండ్రి : ఏం చెయ్యాలే, టెంత్ క్లాస్ టెన్ టైంస్ తప్పాడన్న బాధ ఉందా అసలు వాడికి?
తల్లి : వాడికేం ఖర్మ పది పాసయి ఉద్యోగం చేయటానికి. మనకున్నది ఒకే ఒక్కడు. అంతా వాడిదేగా.
తండ్రి : అవునులే, నేనో లక్షాధికారి వీడో జమీందారు.
తల్లి : చాల్లెండీ గోల, రేపు వాడి పుట్టినరోజు. మీకు తెలుసుగా మన శీనుగాడు చిరంజీవి ఫాన్ అని, ఓ చిరంజీవి సినిమా టిక్కట్లు తెచ్చి సర్ప్రైజ్ చేయండి.
తండ్రి : హూ! తప్పుతుందా, శంకర్ దాదా జిందాబాద్ !

రెండవ అంకం:

తండ్రి: ఒసేయ్ రాములమ్మా! గిన్నెలు కడిగాక, వెళ్ళేప్పుడు ఆ గేటు వేసి వెళ్ళటం మరిచిపోకు.
పనిమనిషి : గట్లనే పెద్దాయన. ఓ మాట చెప్పాలయ్యా మీతోని.
తండ్రి : ఆ చెప్పు.
పనిమనిషి : ఈయాల నా పెళ్ళిరోజు . మరి .. మరి, నిన్నే ఇష్టపడ్డాను, నీతో చెప్పాలని …..
తండ్రి : ఆపేయ్, సిగ్గులేదూ నీకు ఈ మాటలనటానికి. ఇది సంసారులుండే పొదరిల్లు. ఫో అవతలికి!
పనిమనిషి : ఓయ్ ఏందయ్యో? ఏమనుకుంటున్నవ్. నే సెప్పేది పూర్తిగినకుంట, ఏం లొల్లి సేత్తున్నవ్.
నా పెనిమిటి, నేను కల్సి నిన్నే ఇష్టపడ్డాను, నీతో చెప్పాలని సినిమాలకెల్లనికి పైసలిమ్మని అడుగుతే, నన్ను బద్నాం చేస్తవా. నా పెనిమిటిని తీస్కొనొస్తా, తల తిరుగుతుందా?
తండ్రి : ఓ అదా, సరే సరే. ఇదిగో ఈ ఏభై తీస్కోని వెళ్ళిపో.
తల్లి : ఏమిటీ, పనిపిల్లతో పరాచికాలు, కొంపదీసి ఆయనకి ఇద్దరా ఏమిటీ?
తండ్రి : ఛీ ఛీ నన్ను నమ్మే, ఒట్టేసి చెబుతున్నా!
తల్లి : సర్లెండి. ఏవండీ, మనవాడి పెళ్ళిగోల ఏమన్నా పట్టించుకుంటున్నారా?
తండ్రి: అబ్బో ఈ పోరంబోకు, పోకిరి వెధవకి తెగ సంబంధాలు వస్తున్నాయ్ లే.
తల్లి : ప్రియమైన శ్రీవారు, మన శీను చిలిపి కృష్ణుడు కాడండీ, శ్రీరామ చంద్రుడు.
తండ్రి : సరేలే, నన్నెవడు నమ్మాడు. అయినా పెళ్ళాం చెపితే వినాలి కదా.

మూడవ అంకం:

కొడుకు : అమ్మా, నన్ను దీవించు
తల్లి : నా నాయనే, నీలాంటి వాడు వంశానికొక్కడు చాలు. లే లే
కొడుకు : అమ్మా నాన్న కావాలి, ఉన్నారా లోపల?
తల్లి : ఏవండోయ్ శ్రీవారు, మన బంగారం పిలుస్తున్నాడు, రండీ.
తండ్రి : ఇదిగో వచ్చేశా, ఏంటి విషయం?
కొడుకు : డాడీ, ఏంలేదు ఒకటి చెప్పాలని ఉంది, విని చిరునవ్వుల వరమిస్తావా?
తండ్రి : గాడిద గుడ్డు కాదూ, ఒసేవ్, నే చెప్పలా వీడు మామూలోడు కాదు. విషయం చెప్పురా కొడకా.
కొడుకు : అమ్మా నాన్నా, ఓ తమిళ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి .
తల్లి : ఒరే, ఇది 2 మచ్, నిను కనీ పెంచి …..
కొడుకు : ఆ……సెంటిమెంట్ ఒద్దమ్మా, నా వాటా డబ్బిస్తే దుబాయ్ చెక్కేసి దుబాయ్ శీను గా సెటిల్ అయిపోతా.
తల్లి : ఛీ, పోరంబోకు వెధవా, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి మీ నాన్న మాట కాదని,ఓ జులాయి, రౌడీ, దొంగ వయిన నిన్ను వెనకేసుకొచ్చినందుకు మంచి బుద్ధి చెప్పావురా నాకు. ఈ వర్షం సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ. మా ఆస్థిలో నీకు చిల్లు గిన్నె కాదు కదా సత్తు బొచ్చె కూడా రాదు. ద్రోహి, కంటే కూతుర్నే కనాలి అని బాగా బుద్ధి చెప్పావురా కొడకా. ఏవండీ, ఇక మనకెవరున్నారండీ?
తండ్రి: బాధపడకు, నీకు నేను నాకు నువ్వు ఉన్నాము.