బత్తీబంద్ పై నా అభిప్రాయాలు

మే 29, 2008

బత్తీబంద్ పై నా అభిప్రాయాలు ఇలా గతవారం ఇక్కడ పంచుకున్నాను.


నా మొదటి కార్టూన్

మే 21, 2008

 

 

 

 

 

 

 

*** పూర్తి సైజు బొమ్మ కొరకు బొమ్మను క్లిక్కుమనిపించండి. ***

 నాకు ఈ విషయములో స్ఫూర్తిప్రదాతలు రానారె మరియు ఊకదంపుడు గార్లు.


అమెరికాలో అర్చకుల స్థితిగతులు - ఈనాడులో ఓ అవాస్తవ కథనం

మే 7, 2008

చాలా రోజుల నుండీ నేను అర్చకులు, వారి స్థితిగతుల గూర్చి (అమెరికాతో సహా) ఒక సవివరమయిన టపా రాద్దామని సరంజామా తయారు చేసుకుంటూండగానే, ఇవ్వాళ ఈనాడు పత్రిక ఏమాత్రం పరిశోధన అన్నది చేయకుండా ఎవరో నాలుగు ముక్కలు చెబితే అదే నిజమన్న తీరుతో ఈ వ్యాసం ప్రచురించింది. ఇందులో 90% శుద్ధ అబద్దం అని చెప్పటానికి ఇక్కడే అమెరికాలో ఉంటూ ఇక్కడి అర్చకుల జీవనం చాలా దగ్గరినుంచి చూస్తున్నవాడిగా నాకొక్క క్షణం పట్టలేదు. ఎప్పుడో విషయం చప్పబడ్డ తరువాత కంటే, ఇప్పుడు రాయటమే మేలనిపించి రాస్తున్నాను.

 
ఎవరో ఒకాయన ఓ కారు కొనుక్కుంటే, ఆ ఒక్క వార్తని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసెయ్యటం ఈనాడుకే చెల్లింది. ఈ రోజుల్లో కేవలం 10% శాతం అడ్వాన్సు ఇస్తే, 90% అప్పుగా ఇచ్చి కారు చేతిలో పెడతారన్నది విశ్వవిదితం. పట్టుమని ఓ 100 - 200 మంది అర్చకులు కూడా లేని అమెరికాలో, ఇక్కడికి వలస వస్తున్న వారివల్ల భారతదేశములో అర్చకుల లభ్యత తక్కువవుతున్నది అని చెప్పటం ఎంత మూర్ఖత్వమో అనిపించింది. ఇక అసలు విషయానికొస్తున్నా.

స్వర్గీయ టీ.కృష్ణ గారు గతంలో “దేవాలయం” అని ఓ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించారు. నాకిష్టమైన సినిమాల్లో అదొకటి. ధర్మకర్తలు అర్చకులని అలక్ష్యం చేస్తూ ఎలా దేవాలయాల్ని భ్రష్టు పట్టించారు అనే విషయం మీద. శోభన్ బాబు కెరీర్ లో ఇది ఒక గొప్ప చిత్రమని నా నమ్మకం.

ఆ ధర్మకర్తల తాలూకు లక్షణాలు చాలా వరకు ఇక్కడ అమెరికాలోనూ కనపడుతూనే ఉంటాయి అనటంలో సందేహమే లేదు. కొన్ని నిజాలు.

1) అర్చకుని కనీస వేతనం $500 నెలకి నుంచి (అర్చకుడి అవసరమూ, ధర్మకర్తల అవకాశవాదం కలగలిసి) అత్యధికంగా $1250 వరకు ఉంటుంది. ఈ $1250 పుచ్చుకునే వాళ్ళు ఓ పది మంది ఉంటే గొప్ప విశేషమే. అలాంటిది, నెలకు లక్ష రూపాయల జీతం అని అడ్డగోలుగా వార్త ప్రచురించి జనాలను పక్కతోవపట్టించటం అనైతికం.

2) వసతి ఒక్కటి ఉచితమయినంత మాత్రాన మిగతా జీతం అంతా వెనకేసుకోలేరు గదా?  బ్రహ్మచారిగానో లేదా భార్యాబిడ్డల్ని ఇండియాలో వదిలేసి ఉంటేనే ఆ వసతి కూడానూ. తిండీతిప్పలు ఇవన్నిటికీ డబ్బు కావాల్సిందే కదా. వారికొచ్చే జీతంలో మిగతా ఖర్చులన్నీ పోగా ఎంత మిగుల్చుకోగలరన్నది ఇక్కడున్నవారికెరుకే.

3) ఇక ఫ్రీలాన్స్ పురోహితుల సంగతి. ఇక్కడ అమెరికాలో ఉంటున్నవారిలో ఎంత మంది ఇంతవరకూ ఓ ఫ్రీలాన్సు పురోహితుణ్ణి ఇంటికి పిలిచి పూజ చేయించుకున్నారు? ఎంత మంది ఓ దేవాలయం ద్వారా పురోహితుణ్ణి రప్పించుకున్నారు? గ్రీను కార్డు వచ్చి ఫ్రీలాన్సు అవతారమెత్తటానికి ఎన్ని ప్రతిబంధకాలు? ఒకవేళ ధైర్యం చేసి ఎవరయినా అలా అయినా కూడా, స్వంతంగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోవాలంటే, ఇవ్వాల్టి రోజున నెలకి అధమం $500 ఒక వ్యక్తికి అవుతాయి. అదే కుటుంబానికైతే $1000 పైమాటే నెలకి.  $1000 జీతాలున్న స్థితిలోంచి,  ధైర్యం చేసి ఫ్రీలాన్సుకెళ్ళి అంతలేసి ఇన్స్యూరెన్సు ఎవరు కట్టుకోగలరు? అర్చకుడు కాదు కదా, అమెరికాలో గొప్పగా సంపాదించే సాఫ్టువేరు కుర్రాడు కూడా సొంతగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోలేడు, తన యజమాని అండ లేకుండా.

4) న్యూజెర్సీ లోని కొన్ని దేవాలయాల్లో అర్చకులపై ఉన్న నియమాలు వింటే, ఆనాటి ధర్మకర్తలని గుర్తుకు తెస్తారు. అర్చకులు కూర్చోటానికి వీలు లేదు దేవాలయంలో. అదికూడా ఏకధాటిగా 8 గంటలు పనిచేయాల్సివచ్చే శని, ఆదివారాల్లో.

ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చును. ఓ అర్చకుడు, ఓ బ్రాహ్మణుడు కొంత వెనకేసుకున్నాడు అంటే అదేమిటో పెద్ద నేరంగానూ, సృష్టిలో ఓ కొత్త వింతగానూ ప్రచారం కల్పించే తత్త్వం విడనాడితే బాగుంటుంది.

అమెరికాలో అర్చకుడి సంపాదనకీ, సాఫ్టువేరు డెవలపరు సంపాదనకీ పోలికా? ఇంత చెత్త న్యూసు ఈనాడులో చూసి, చదివి చాలా కాలమయ్యింది.