విమానాల్లో “బొద్దు”గుమ్మలు

జూన్ 6, 2008

మా బంధువుల్లో ఒకమ్మాయి బొద్దుగా ఉండేది. ఎవరన్నా ఆట పట్టిస్తే, బొద్దుగా ఉన్నానని నవ్వుతారేమిటి, ఎముకలు బయటపడే పీల తనం కన్నా, అసలు బొద్దుగా ఉంటేనే అందం తెలుసా అనేది. అంతే కాదు, అలనాటి మహానటి సావిత్రిని గుర్తు చేసి, సావిత్రి బొద్దుగా ఉంటేనే జనాలు ఇష్టపడ్డారని ఎదురు వాయించేసేది. సావిత్రిని తెలుగు వాళ్ళు ఇష్టపడింది బొద్దుగా ఉండటం వల్ల కాదమ్మా ఆవిడ నటన వల్ల అన్నది ఆవిడతో వాగ్వివాదంలో ఒప్పించి మనం గెలవలేమనుకోండి. అసలు సంగతి అదికాదు.

మరేమిటి అంటే మన ఎయిర్ ఇండియా వారు వారి విమానాల లోపల పనిచేసే సిబ్బందిని ముఖ్యంగా ఎయిర్ హోస్టెసు లను పరిమితికి మించి బరువు పెరిగితే (చాలా మంది అప్పటికే పరిమితి మించారన్నది వేరే సంగతి, అలాంటి వారిని బరువు తగ్గమన్నారు) వారిని గ్రౌండ్ డ్యూటీలకి మారుస్తామని హెచ్చరించారుట. ప్రభుత్వ రంగ సంస్థ గదా, ఎవరూ లెక్క చెయ్యలేదు సరికదా ప్రభుత్వం మీదే కేసు పెట్టార్ట కోర్టులో. (మేము లావుగా ఉన్నా చేసే పనిలో ఏ తేడా రాకుండా చేస్తున్నామని). అయినా పరుగెత్తాల్సిన పోలీసులే ఇంతలేసి పొట్టలేసుకొని పోలీసు శాఖలో నిక్షేపంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే, కుళ్ళు కాకపోతే 200 అడుగుల విమానంలో అటూ ఇటూ తిరిగుతూ ప్రజలకి సేవలు అందిస్తున్న మా మీదే ఎందుకీ కక్ష సాధింపు అని వాళ్ళు అనుకుంటూండొచ్చు.

గట్టి వాదనే. కానీ వచ్చిన చిక్కల్లా ఆ ముక్క అనాల్సింది ప్రయాణిస్తున్న ప్రయాణీకులు గానీ వారు కాదు కదా. ఓ పక్కన తోటరాముడు మల్లె తీగల్లాంటి సేవికలున్నారని కింగ్ ఫిషర్లో, జెట్లలో తానొక్కడే ఊళ్ళు తిరిగెయ్యటమే కాకుండా, పనిగట్టుకుమరీ ఇతరుల్ని రెచ్చగొట్టి ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాలు ఎక్కటమంత దురదృష్టకరం మరోటి లేదన్నట్లు చెప్తున్నాడు. ఇలా అయితే, భారీకాయాల సేవికలున్న ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాల్ని ఎవరు ఎక్కుతారు చెప్పండి? ఇన్నాళ్ళూ అంటే ఏదో పెద్ద వాళ్ళూ, పెద్ద వయసు వాళ్ళు లేదా మరో ఎయిర్ లైన్సు గతి లేక ప్రయాణించారు అంటే అర్ధం ఉంది. ఇప్పుడలా కాదే? విమానాలు ఎక్కే వాళ్ళలో కుర్రకారు ఎక్కువైపోయారు. సవాలక్ష విమాన కంపనీలు. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి పనితనంతో పాటు రూపు కూడా అవసరమే. తమ అస్థిత్వానికే ప్రమాదమొచ్చే పరిస్థితి కాకపోతే, మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలోని ఎయిర్ లైన్సు వారు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు కదా. కోర్టు కూడా వాస్తవ స్థితి గ్రహించినట్లుంది. ఒళ్ళు తగ్గాల్సిందే నంటూ జారీ చేసిన హుకుం సమర్ధించింది.

ఈ రోజుల్లో బొద్దుగా ఉండటం ముద్దు కాదని ఎలా వీళ్ళకి చెప్పటం చెప్మా?

** మన కవులు ఎక్కడో స్త్రీలు బొద్దుగా ఉండటాన్ని మెచ్చుకున్నారని గుర్తు. ఎవరికైనా గుర్తుందా ఏ సందర్భంలోనో?


నా మొదటి కార్టూన్

మే 21, 2008

 

 

 

 

 

 

 

*** పూర్తి సైజు బొమ్మ కొరకు బొమ్మను క్లిక్కుమనిపించండి. ***

 నాకు ఈ విషయములో స్ఫూర్తిప్రదాతలు రానారె మరియు ఊకదంపుడు గార్లు.


ఎప్పటికో నా కలల ప్రయాణం - I

జనవరి 30, 2008

ఇండియా ప్రయాణం అంటే వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రవాసుడికి సంతోషమే.  కానీ ప్రయాణం అంటే చంకనో/వీపునో ఓ చిన్న సంచీ తగిలించేసుకొని టింగురంగా అంటూ వెళ్ళగలిగే అదృష్టవంతులు కొందరే. నాకు వాళ్ళని చూస్తే, ప్రతిభా భారతి ని మన కాకా అదే వెంకటస్వామి చూసినంత అసూయగా ఉంటుందంటే నమ్మండి.

నా మటుకు నాకు అలా తేలిగ్గా చెకిన్ చెకౌట్ చేసుకోగలిగే రోజంటూ వస్తుందా అని ఆశపడటంతోనే సరిపోతోంది. ఎంతైనా కుటుంబీకుణ్ణి కదండీ. అలా అని భార్యాపిల్లల్ని బూచిగా చూపించి, నువ్వింకేమీ టింగురంగడివి కాదోయ్ భర్తవి, “భరించువాడు భర్త” అని శపించకండి. కాస్త నా గోడు వినండి.

నా ఈ తీరని కోరికకి ప్రతినాయకులు(అదేనండీ విలన్లు) ఉన్నారు ఇద్దరు.

  1. సామాను (లగేజీ)
  2. చివరినిమిషపు నక్షత్రకులు

అది నా ఇండియా ప్రయాణం నిర్ణయమైన రోజు. టిక్కట్లు హోల్డ్ చేసుకొని సిపాయి చిన్నయ్య లాగా “నా జన్మ భూమి ..భూమి ….భూమి…. నాజన్మభూమి ఎంత అందమయిన దేశము” అంటూ ఆగి ఆగి మ్యూజిక్కుతో సహా పాడుకుంటున్న సమయంలో…

ఓ తియ్యని చల్లని పిలుపుతో మా ఆవిడ పలకరించింది. ఏవండీ…….ఏవండీ…

ఆ పిలుపులో ఉన్న లోతుకి నాకు కొంచం భయమేసి, “నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషి నోట ఆ పిలుపేంటి” అని అందుకున్నా.. (ఏమాటకామాటే, ఈ పాట నా తురుపుముక్క ఇలాంటి సందర్భమెప్పుడొచ్చినా)

విషయం గ్రహించినట్లుందేమో, ఏ  ప్రేమగా పిలవటమూ తప్పేనా?

తప్పులేదు గానీ, అది నాకొస్తున్న ముప్పుకి గుర్తు అన్నా నవ్వుతూ.

నేను రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టానని తెలుసుకొని….ఆ పిలుపులోని లోతుని కాస్త తగ్గించి ఏంలేదు అండీ, మా అమ్మానాన్న కూడా మనతో వస్తార్ట.. అని చల్లగా చెప్పింది.

క్షణాల్లో ఆనందం ఆవిరయింది, సిపాయి చిన్నయ్య కూలబడ్డాడు. తేరుకొని ఈ చివరి నిమిషం షాకులేంటమ్మా అని అడిగా.

అదేంటి అలా అంటావ్? వాళ్ళకి మనతో రావాలనుంది, వస్తున్నారు.

అది సరే, నా బాధ వాళ్ళు వస్తున్నారని కాదు, వాళ్ళ లగేజీ, మన లగేజీ….. నా కోరిక(గొణుక్కుంటూ)….

ఏంటీ ఏదో కోరిక అంటున్నారు? అయినా ఆ మాత్రం లగేజీ మానేజ్ చెయ్యలేవా మా వాళ్ళవి అంటూ అని చర్రున లోపలికెళ్ళింది.

రాత మారింది, పాట మారింది … “అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా….. ఆశా నిరాశేనా..”

అనుకున్నదంతా అయ్యింది. అక్షరాలా 8 పెద్ద సైజు బ్యాగులు, 4 హాండ్ బ్యాగులు (పేరుకే హ్యాండ్ బ్యాగులు, నిజానికి వాటి బరువు పెద్దదానిలో దాదాపు సగం ఉంటాయి). అప్పట్లో 35 కిలోలు వరకు పెద్ద బ్యాగులు, చిన్నవి 20-25 కిలోలు తూగవచ్చు అనుకుంటా. కానీ వాటి పర్సనాలిటీ చూస్తే, ఓ 2 కిలోలు ఎక్కువే గానీ తక్కువ చచ్చినా తూగేలా లేవు. నన్ను నమ్మండి. అందులో నా వాటా 10% లోపే.

అంతలో నా గుండె గుభేల్ మంది.  ఎయిర్ పోర్టులో బరువెక్కువన్నారంటే? ఎయిర్ పోర్టులో బ్యాగులు బరువెక్కువని ఆ జనాల మధ్య కౌంటరులో తీయించి అవి అటూ ఇటూ బ్యాగుల్లో సర్దటం నాకు నలుగురిలో నన్నెవరో వస్త్రాపహరణం చేసినంత బాధగా ఉంటుంది. అయినా బట్టల విషయములో ఆడవాళ్ళతో పోరాడి బతికి బట్టలు కట్టిన మగాడెవడున్నాడు గనక, అని నాలో నేనే దారుణంగా విలపించా. కొన్ని క్షణాలపాటు దీక్షగా ధ్యానం చేసి “నేనేగనక సతివ్రతుడనయితే” అన్న ప్రతిజ్ఞతో నా ప్రార్ధన పవరు పెంచి, ఆ ఎయిర్ లైన్స్ వాళ్ళని విమానాల్లో తీసుకెళ్ళగలిగే బరువుని తగ్గించమని దేవుణ్ణి ప్రార్ధించా.

వస్త్రాపహరణం సీను తప్పించుకోవాలంటే, ఖచ్చితంగా బరువు కొలవాలి. కానీ ఎలా? ఈ దేశంలో సీలింగుకి కొక్కాలుండవే స్ప్రింగు వేలాడదీయటానికి? గతిలేక మనుషులు తూగే వేయింగ్ మిషను బయటికితీసా. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు పాపం అది నన్ను నమ్మింది. రెండుకాళ్ళు పెట్టి నిలబడాల్సిన చోట ఒళ్ళంతా పెడితే ????? ఇంకేమౌతుంది చస్తుంది. అదే జరిగింది, ఈ బ్యాగుల మోతకి అది రెండో బ్యాగు తూచేలోపే గుడ్లు తేలేసింది. చచ్చినా దానికి వీరమరణం సిద్ధించింది. ఎందుకంటే, అది ఒక బ్యాగు సరిగా తూచి ప్రాణాలు విడిచింది కాబట్టి. ఆ బాగుని ఒక చేత్తో ఎత్తి, మరో చేత్తో మరో బ్యాగు ఎత్తి నేనే ఓ తూనిక నయ్యి ఎలాగో మొత్తానికి తూచా.

అసలు నాకు తెలీక అడుగుతాను, వాడు తీసుకెళ్ళొచ్చు అన్నాడు కదాని తీసుకెళ్ళటమేనా? కాస్త మోసే మొగాణ్ణి, వేయింగ్ మిషన్ని  దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చుగదా ఈ ఆడవాళ్ళు? అని నా సందేహం. అదీకాక ఇండియా నుంచి వచ్చేప్పుడు సామానుకి అర్ధం ఉంది, వెళ్ళేప్పుడు కూడానా? నోరూరుకోదుగా, అడిగేశాను శ్రీమతిని.

ఎంత పిచ్చివారండీ మీరు అన్న లుక్కిచ్చి, అదా మీ సందేహం. ఇండియాలో కొన్నామే కానీ అసలిక్కడ వేసుకునే అవకాశాలు, సందర్భాలు ఏవీ? అదీగాక, మోడల్స్ వెంటవెంటనే మారుతున్నాయి. ఇక్కడెలాగూ ఇవెవరికీ ఇవ్వలేముకదా, పారేసే బదులు ఇవి అక్కడ అవసరమయిన వాళ్ళకిచ్చేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకోవటమే. అంతేకాదు, ఈ కాన్సెప్ట్ అఖిల ఉత్తర అమెరికా భారత మహిళలు ఏకగ్రీవంగా అమలు పరుస్తున్నారని ఆ తర్వాత నా లాంటి ఇతర బాధితుల వల్ల తెలిసింది.

ఇలా నా మొదటి ప్రతినాయకుడు  వొంటిని హూనం చేసి, నా కలని కల్ల చేసి అష్టకష్టాలతో ఇండియా చేర్చాడు.

కానీ పడ్డవారెపుడూ చెడ్డవారు కాదుగా. నేను ఆ రోజు చేసిన ప్రార్ధన చిందో ఏమో ఎయిర్ లైన్స్ వాళ్ళు చివరికి వెంట తీసుకెళ్ళగలిగే బరువును తగ్గించి 23 కిలోలకి పరిమితం చేసార్ట.

కొన్నాళ్ళకి, మళ్ళీ నా ఇండియా ప్రయాణం వేళయింది. టిక్కట్లు హోల్డ్ చేసుకొని సిపాయి చిన్నయ్య లాగా “నా జన్మ భూమి ..భూమి ….భూమి…. నాజన్మభూమి ఎంత అందమయిన దేశము” అంటూ ఆగి ఆగి మ్యూజిక్కుతో సహా పాడుకుంటున్న సమయంలో…

ఓ తియ్యని చల్లని పిలుపుతో మా ఆవిడ పలకరించింది. ఏవండీ…….ఏవండీ…

ఈసారి ఏమయ్యిందో, నా రెండో ప్రతినాయకుడెలా అడ్డుపడ్డాడో చెబుతా….