ఆహా థాపర్ మహాశేయా, ఎంత చక్కగా కమ్యూనిస్టుల తలంటావయ్యా?

ఆగష్టు 23, 2007

అదేదో సామెత ఉంది గద “మొరిగే కుక్క కరవదని”. మన కమ్యూనిస్టులు తీరలాగే ఉంది. తామేదో జాతి రక్షకులమని పేరుతెచ్చుకుందామని మన (అ)ప్రధాని మన్మోహన్ ని అణు ఒప్పందం మీద గట్టిగా బెదిరించారో లేదో, తిక్కరేగిన (అ)ప్రధాని గారు తిరిగి వాళ్ళని మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి పొండి అన్నాడు కన్యాశుల్కం లో లుబ్దావధాన్లు గనక “తాంబూలాలు ఇచ్చేసా,తన్నుకు చావండి” అన్నట్లు.

(అ)ప్రధాని ఇంత దెబ్బ కొడతాడని ఊహించని కమ్యూనిస్టులు ఇప్పుడు జాతికి ఎందుకు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవట్లేదో చెప్పలేక నానా గడ్డి కరుస్తున్నారు. ఇలాంటి పనికి మాలిన బెదిరింపులతో ఇదివరకు స్టాక్ మార్కెట్ ని ఉత్తపుణ్యానికి పడగొట్టి ఎందరిదో ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తంతు, లాక్కో లేక పీక్కో లేక.

సీతారాం ఏచూరి అంతటివాడు కరణ్ థాపర్ ప్రశ్నలకి నీళ్ళు నమలటం చూస్తుంటే, నా సామిరంగా తెగ సంబరపడ్డా, ఎంత బాగా ఎండగట్టావు నాయనా మా అందరి తరపున అనుకుంటూ. వీలైతే మీరూ ఓ లుక్కెయ్యండి డెవిల్స్ అడ్వకేట్ మీద.

అలానే కొన్ని నెలల క్రిందట ఇదే థాపర్ మహాశేయుడు మన వైయస్సు ని ముప్పు తిప్పలు పెట్టాడు.


వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవచ్చుట, నమ్మొచ్చా ఈ డైలాగ్?

ఆగష్టు 11, 2007

మన ప్రధానమంత్రి మన్మోహన్ గారికి అప్రధాని, వెన్నెముకలేని ప్రధాని అని అంటున్నవాళ్ళ మాటలు వినీ వినీ ఉన్నట్టుండి పౌరుషం వచ్చినట్లుంది! ఒక్కసారిగా, వామపక్షాలు ఖబడ్దార్ అని అరచాడు. కానీ, అసలు ఈ డైలాగుల్ని సీరియెస్గా తీసుకునేదెవరు?

వామపక్షాలేమో పోన్లే పాపం తిడితే తిట్టనీ, ఎవరు మాత్రం ప్రజలు, ప్రతిపక్షాలతో అన్నేసి మాటలు పడుతూ ఎన్నాళ్ళు ఊరికే ఉండగలుగుతారు అని పట్టించుకోరు.

“మేడం” గారు సరే సరి, రేపో మాపో దగ్గరికి పిలిపించుకొని మళ్ళీ ఓ క్లాసు పీకి పంపుతుంది.

ఇక ప్రజలంటారా, ఈయన్ని నమ్మటం ఎప్పుడో మానేసారు. రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో దేశంలో ప్రతి వాడికీ తెలుసు.

మరింకా ఈ అరుపులూ, రంకెలూ ఎందుకు ప్రధాని గారు?


మళ్ళీ రబ్బరు స్టాంపు రాష్ట్రపతేనా!

జులై 20, 2007

రాష్ట్రపతి కలాం గారు సెలవు తీసుకొనే సమయం రానే వచ్చింది. “మేడం” గారి పుణ్యమా అని మళ్ళీ రబ్బరు స్టాంపుగా ప్రతిభా పాటిల్ కొత్త రాష్ట్రపతిగా రాబోతున్నారు.

ఎప్పుడో అన్నగారు, రామారావు గారన్నట్లు ఈ గవర్నర్లు, రాష్ట్రపతులు శుద్ధ దండగ! కానీ కొత్తల్లుడు లాంటి ఈ పదవులు ఎవడు మాత్రం కాదంటాడు. ఒక రకంగా, కలాం గారు అక్కడి నుంచి బయటపడటమే మంచిది, ఇప్పుడయితే మరిన్ని మంచి పనులు చెయ్యగలడు. ఓ ఉపాధ్యాయుడిగా లేదా శాస్త్రవేత్తగానో….