ఒలంపిక్స్ ముగియబోతున్నాయి. భారతదేశానికి సంబంధించినంతవరకూ ఇది ఖచ్చితంగా చిరకాలం గుర్తుంచుకోదగ్గ ఒలంపిక్సే. ఇప్పటికే ఓ స్వర్ణం, ఓ కాంస్య పతకంతో పతకాల పట్టీలో స్థానం సంపాదించుకొని సగర్వంగా నిలబడగలిగింది. నిజంగానే భారతీయులుగా మనందరం గర్వించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఓ చిక్కుంది. చిక్కేమిటి, నా వరకైతే ఇది చింతే.
ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకి ఓ వింత జబ్బు పట్టుకుంది. ప్రజల సొమ్ముని అప్పనంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా దానం, ధర్మం చేసి పారెయ్యటం. మన రాష్ట్రంలో నాకు గుర్తున్నంత వరకూ ఇది మన చంద్రబాబు నాయుడి గారి హయాంలో మొలకలా మొదలై, దిన దిన ప్రవర్ధమానమై ఇప్పుడు ఓ మానై కూర్చుంది.
ఎవరో ఓ క్రీడాకారుడు స్వంతంగానో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతోనో పరిశ్రమ చేసి అంతర్జాతీయంగా పతకాలు తెచ్చాడే అనుకోండి. దేశానికి అది కీర్తి ప్రతిష్టలు తెచ్చే విశేషమే అయినా, మరీ అంత గంగవెర్రులెత్తుతూ దేశ ప్రజలు అంతకన్నా ఢక్కాముక్కీలు తిని సంపాదించి ఖజానాకి నిజాయితీగా జమచేసిన సొమ్ముని అప్పనంగా పళ్ళెంలో పట్టి, తీసుకో అమ్మా, బాబూ అని ఇవ్వటంలో అసలు న్యాయం ఉందా? రాష్ట్రానికీ, దేశానికీ అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్ళు పోరాడటానికి కావాల్సిన సదుపాయాలు లేదా కార్యాచరణ ప్రణాళికలు గట్రా ఏవీ ఉండవు. కానీ బడ్జెటులో జరుపుతున్న కేటాయింపులు (అరకొరయినా) ఏమవుతాయో ఎవరికీ తెలియదు. బూట్లు లేకుండా హాకీ ఆడమంటారు, హైదరాబాదులో ఉన్న ఆస్ట్రోటర్ఫ్ తప్ప దేశంలో ఆ స్థాయి మైదానం మరోటి ఉండదు. పుట్టి బుద్దెరిగిన్నాటి నుంచీ సురేష్ కల్మాడీ తప్ప మరో మనిషి పేరు నేను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వినలేదు. ఈ మహానుభావుడు చేసే పనేమిటో ఎవరికీ తెలియదు.
సానియా మీర్జా పేరిట కొన్ని కోట్లు కుమ్మరించారు. అమ్మాయి ఆ స్థాయికి రావటానికి కష్టపడింది, ఒప్పుకుంటా, కానీ ప్రభుత్వాల నిర్వాకం కన్నా మొదట్నించీ స్పాన్సర్ అయిన GVK గ్రూపు వల్ల. అన్నేళ్ళు మూల పడిఉన్న యంత్రాంగం ఆ అమ్మాయి ఓ పతకం తెచ్చింది అన్న మాట వినగానే, ఒక్కసారిగా ఆ విజయాన్ని తమ ప్రభుత్వ విజయంగా ప్రచారం చేసుకుందామన్న ఆత్రుతతో ప్రజల సొమ్ము కోట్లు కుమ్మరించటానికి సిద్ధం. తీరా రాశులు కుమ్మరించాక తరచి చూస్తే, అమ్మాయి మళ్ళీ ఆ ధాటితో ఆడిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు రకరకాల కారణాలు, నొప్పులతో ఓటములూ, తప్పుకోవటాలున్నూ.
ఈ వితరణల తంతు ఇలా చాలా కాలం నుంచీ కొనసాగుతోంది. అకాడెమీల పేరుతో విలువైన స్థలాలు కట్టబెట్టటం మరో జబ్బు. ఏ, ఆ క్రీడాకారుడికే స్వతంత్ర్యాన్నిచ్చి ప్రభుత్వ అజమాయిషీలో అవన్నీ జరిపించొచ్చు కదా. అడిగే నాధుడే లేడు. ఇందాక పైన చెప్పిన అమ్మడు కూడా పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడెమీకి స్థలం పొందినట్లు, తాను కూడా పూర్తిగా ఆటలో దిగజారేలోపు స్థలం పొందుదామని విశ్వప్రయత్నాలు అడపాదడపా చేస్తూనే ఉంది. ఈ వితరణలు/సంతర్పణలు మరి కాస్త వికటించి భారతావని అంతా వ్యాపించింది. పోటీలకు ముందుగానే తగిన వనరులు కూర్చి సరయిన మరియు అందరికీ సమ్మాన సౌకర్యాలు, అవకాశాలు కల్పించకుండా ఎవరో ఒకరో ఇద్దరు సహజంగా అబ్బిన ప్రతిభతోనో లేదా స్వతహాగా అమర్చుకున్న సౌకర్యాలతోనో గెలిస్తే, అప్పుడు ఎగబడి, విరగబడి వాళ్ళని నెత్తిమీద ఎక్క్కించుకోవటం దిగజారుడుతనానికి పరాకాష్ట. వీళ్ళకి ప్రోత్సాహం సంగతి దేవుడెరుగు, అరకొర సౌకర్యాలలో సాధన చేసి, చెమటోడ్చి నెగ్గలేకపోయిన వారి గతేమిటి? నాకు తెలిసి ఇలా కోట్లు సొంతం చేసుకున్న వాళ్ళల్లో ఒకరో ఇద్దరో మళ్ళీ ఆ స్థాయి ఫలితాలు తెచ్చి ఉంటారేమో.
యధాప్రకారం ఒలంపిక్స్ విజేతలకి అప్పుడే కుమ్మరింపులు మొదలయ్యాయి. ఒకడు జీవితకాలం మొదటి తరగతి ఏసీ ప్రయాణం అంటాడు, మరొకడు జీవితకాలం విమాన ప్రయాణమంటాడు. ఈ లెఖ్ఖన ఆటగాళ్ళని జీవితకాలం ప్రజాప్రతినిధిగా నామినేట్ చేసే రోజు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ఆశ్చర్యకరమైనా ఉన్న నిజమేమంటే, మనం మన చేతుల్లో నుంచి జారిన డబ్బుని మనది కాదు అని నిర్ణయించేసుకుని, మన జేబులో ఉన్నదే మన డబ్బు అని ఎంతో అమాయకంగా మనల్ని మనం నమ్మించుకుంటాం. ప్రభుత్వ ఖజానా మనది కాదు, రాజకీయ నాయకులదే అని సెటిలైపోతాము. ఈ విషయంలోనే ప్రాక్ పశ్చిమ దేశాల్లో తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. “పన్నుదారుల డబ్బు” అంటే ఆ దేశాల్లో చాలా శాతం నాయకులకి అది తమ డబ్బు అన్న స్వేచ్ఛ కన్నాప్రజల డబ్బు అన్న హెచ్చరిక చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేలా సమాజం వెంటపడుతూనే ఉంటుంది. అది మన దేశంలో లేనప్పుడు “ఎవడబ్బ సొమ్మని తేరగ తింటావు లేదా పంచుతావు…” అని పాడుకోవటంలో అర్ధం లేదేమో కూడా.
అసలు ఇలా ప్రణాళికలని పక్కన పెట్టి ప్రతిభ అంటూ అడ్డగోలుగా ఇస్తూ పోతే ఓ IAS,IPS,IIS,IIM,IIT,ACS,CWA,CA వీటన్నిట్లో టాపర్లకి లేదా ఇతర రంగాల్లో విదేశాల్లో పేరు తెచ్చినవారికి ఏటా ఎంతెంత కుమ్మరించాలిట? ఏం వీటిల్లో ప్రతిభ మన దొడ్లో కాసే జామకాయలా, ఏ కష్టమూ పడకుండానే కాయటానికి? లేదా క్రీడల్లో ప్రతిభ మరింకే ప్రతిభకీ అందనంత అసాధ్యమైనదా?
ఏ నాటికి బుర్ర పెట్టి వాస్తవంగా ఆలోచిస్తారో?
రాసినది వికటకవి

రాసినది వికటకవి










రాసినది వికటకవి

